అమెరికాలో భారత విద్యార్థినిపై పిడుగుపాటు.. క్రౌడ్ ఫండింగ్ కోరుతున్న బాధిత కుటుంబం
అమెరికాలో భారత యువతి పిడుగుపాటుకు గురైన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ మేరకు బాధితురాలి గుండె సుమారు 20 నిమిషాల పాటు లయ తప్పిందని, దీంతో మెదడు ప్రభావితమైనట్లు అక్కడి వైద్యలు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని నర్సరావుపేటకు చెందిన 25 ఏళ్ల కోడూరు సుశ్రూణ్య, ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లింది. యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ (Masters in Information Technology) అభ్యసిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫ్రెండ్స్ తో కలిసి ఓ స్విమ్మింగ్ పూల్ వెంట నడుస్తున్న క్రమంలో ఆకస్మాత్తుగా పిడుగుపడింది. ప్రమాద తీవ్రతకు ఆమె ఎగిరి కొలనులో పడిపోయారు.
క్రౌడ్ ఫండింగ్ వేదిక 'గోఫండ్ మీ' ద్వారా ఆర్థిక సాయం కోరుతున్న బాధిత కుటుంబం
జులై తొలి వారంలోనే ఈ ప్రమాదం జరగ్గా, సుశ్రూణ్య ప్రస్తుతం కోమాలో ఉన్నారు. ఆమె పరిస్థితి ఆందోళకరంగా ఉందని వైద్యలు తెలిపారు. అయితే సుదీర్ఘ కాలం వైద్య చికిత్సలు అందించాల్సి ఉంటుందని ఆమెే బంధువు సురేంద్ర కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పెర్క్యుటేనియస్ ఎండోస్కోపిక్ గ్యాస్ట్రోస్టోమీ ట్యూబ్ సహకారంతో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు వైద్యలు పేర్కొన్నారు. MRI రిపోర్టులో అనాక్సిక్ ఎన్సెఫలోపతి ఏర్పడినట్లు (మెదడుకు ఆక్సిజన్ ఎక్కువ కాలం అందకపోవడం) డాక్టర్లు వివరించారు. అనాక్సిక్ ఎన్సెఫలోపతి కారణంగా న్యూరో సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. వైద్య చికిత్సలకు అయ్యే భారీ ఖర్చు కోసం క్రౌడ్ ఫండింగ్ వేదిక 'గోఫండ్ మీ' ద్వారా బాధిత కుటుంబం ఆర్థిక సాయం కోరుతున్నారు.