LOADING...
Indian H-1B Worker: హెచ్‌-1బీ హోదా కోసం డబ్బుల డిమాండ్‌?.. అమెరికాలో భారతీయ ఉద్యోగి దావా
హెచ్‌-1బీ హోదా కోసం డబ్బుల డిమాండ్‌?.. అమెరికాలో భారతీయ ఉద్యోగి దావా

Indian H-1B Worker: హెచ్‌-1బీ హోదా కోసం డబ్బుల డిమాండ్‌?.. అమెరికాలో భారతీయ ఉద్యోగి దావా

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 17, 2026
09:48 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఓ భారతీయుడు హెచ్‌-1బీ వీసా హోదాను కాపాడుకోవాలంటే భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాలని తన కంపెనీ ఒత్తిడి తెచ్చిందని ఆరోపిస్తూ టెక్సాస్‌ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీ యజమాని కూడా భారతీయ మూలాలున్న వ్యక్తే కావడం. భారత్‌కు చెందిన రిషికేశ్‌ రాజ్‌ మీసాలా విద్యార్థి వీసాపై అమెరికాకు వెళ్లి ఉన్నత విద్య పూర్తి చేశారు. 2023లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తయ్యాక హెచ్‌-1బీ వీసా స్పాన్సర్‌షిప్‌తో ఉద్యోగం పొందారు. టెక్సాస్‌కు చెందిన, భారతీయ మూలాలున్న సాయి జితేందర్‌ కలగర ఆధ్వర్యంలోని కంపెనీలో ఆయనను రిజర్వ్‌ బెంచ్‌లో ఉంచారు.

వివరాలు 

జీతానికి సంబంధించిన పే స్టబ్స్

రిషికేశ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ ప్రకారం.. తనకు ఎలాంటి పని కేటాయించకపోయినా, హెచ్‌-1బీ ఉద్యోగిగా కొనసాగుతున్నట్లు చూపించేందుకు, వీసా హోదా కొనసాగాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాలని కంపెనీ బలవంతం చేసింది. అంతేకాకుండా అదనపు చెల్లింపులు చేస్తేనే తన జీతానికి సంబంధించిన పే స్టబ్స్‌ (పే స్లిప్స్‌) ఇస్తామని చెప్పినట్లు ఆరోపించారు. అమెరికాలో హెచ్‌-1బీ ఉద్యోగులకు పే స్టబ్స్‌ అత్యంత కీలకమైన పత్రాలు. ఉద్యోగి చట్టబద్ధంగా పనిచేస్తున్నట్లు నిరూపించుకోవడానికి, వీసా పొడిగింపుకు, అలాగే మరో సంస్థలో ఉద్యోగం పొందేందుకు ఇవి అవసరమవుతాయి. ఈ వ్యవహారంపై తాను ప్రశ్నించగా.. తనపై అమెరికా ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) అధికారులకు ఫిర్యాదు చేస్తామని కంపెనీ ప్రతినిధులు బెదిరించినట్లు రిషికేశ్‌ ఆరోపించారు.

వివరాలు 

కంపెనీకి సుమారు 8,800డాలర్లు చెల్లింపు 

అంతేకాకుండా భారత్‌లో ఉన్న తన తండ్రిని కూడా ఇదే విషయంలో బెదిరింపులకు గురిచేశారని పేర్కొన్నారు. ఇమిగ్రేషన్‌ హోదా కోల్పోతాననే భయంతో చివరకు కంపెనీకి సుమారు 8,800డాలర్లు చెల్లించాల్సి వచ్చిందని ఆయన తన పిటిషన్‌లో తెలిపారు. ఈ కేసులో రిషికేశ్‌ తరఫున అమెరికాకు చెందిన ప్రముఖ ఇమిగ్రేషన్‌ లిటిగేషన్‌ సంస్థ బనియాస్‌ లా (Banias Law)కోర్టులో దావా వేసింది. చెల్లించని వేతనాలు,బలవంతంగా వసూలు చేసిన మొత్తాలను కలిపి బాధితుడికి కంపెనీ నుంచి మొత్తం 97,248 డాలర్లు చెల్లించాల్సి ఉందని ఆ సంస్థ పేర్కొంది. అయితే,రిషికేశ్‌ చేసిన ఈ ఆరోపణలు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉండగా, ఇంకా న్యాయస్థానంలో రుజువు కాలేదు. మరోవైపు,ఈ ఆరోపణలపై కంపెనీ యజమాని సాయి జితేందర్‌ కలగర ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

Advertisement