Iran hits 2 oil tankers: పర్షియన్ గల్ఫ్‌లో ట్యాంకర్లపై 'సూసైడ్ బోటు' దాడి.. భారతీయుడు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా,దాని మిత్ర దేశాలకు చెందిన నౌకలపై ఇరాన్ దాడులు పెరుగుతున్నాయి. తాజాగా ఇరాక్ ప్రాదేశిక జలాల్లో రెండు చమురు ట్యాంకర్లపై 'సూసైడ్ బోటు'తో దాడి జరగడం సంచలనంగా మారింది. ఈ ఘటనలో ఓ భారతీయుడు మృతి చెందినట్లు సమాచారం. పర్షియన్ గల్ఫ్‌లో ఇరాక్ తీరం సమీపంలో ఈ దాడి జరిగింది.
వివరాలు
చమురు సేకరణలో నిమగ్నమై ఉన్న సమయంలో పేలుడు
దాడికి గురైన నౌకలను అమెరికాకు చెందిన సేఫ్‌సీ విష్ణు మరియు గ్రీస్‌కు చెందిన జెఫిరోస్గా గుర్తించారు. సేఫ్‌సీ విష్ణు నౌక మార్షల్ ఐలాండ్స్ జెండాతో ప్రయాణిస్తుండగా, జెఫిరోస్ నౌకపై మాల్టా జెండా ఉంది. ఈ రెండు నౌకలు తీర ప్రాంతంలో చమురు సేకరణలో నిమగ్నమై ఉన్న సమయంలో పేలుడు పదార్థాలతో నిండిన 'సూసైడ్ బోటు' వాటిని ఢీకొట్టినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. దీంతో భారీ పేలుడు సంభవించి, నౌకల్లో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో రెండు నౌకల్లో ఉన్న మొత్తం 38 మంది సిబ్బందిని రెస్క్యూ బృందాలు సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి.
వివరాలు
యూఏఈ తీర ప్రాంతంలో దాడి
అయితే ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మృతుడిని భారతీయుడిగా గుర్తించినప్పటికీ, అతని పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఈ దాడికి తామే బాధ్యులమని ఇరాన్ ప్రకటించింది. ఈ విషయాన్ని తమ అధికారిక మీడియా ద్వారా వెల్లడించింది. ఫిబ్రవరి 28న పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధి మార్గంలో ప్రయాణించే చమురు నౌకలపై తరచుగా దాడులు జరుగుతున్నాయి. బుధవారం కూడా మూడు వాణిజ్య నౌకలపై డ్రోన్ దాడులు జరిగాయి. వాటిలో ఒక నౌక థాయ్ జెండాతో భారత్‌కు వస్తుండగా, యూఏఈ తీర ప్రాంతంలో దాడి జరిగినట్లు సమాచారం.