Mahender Makhijani: అమెరికాలో రూ.950 కోట్ల బ్యాంకు మోసం.. భారత సంతతి వ్యాపారి మహేందర్ మఖిజానీ అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో భారీ బ్యాంకు మోసం కేసు వెలుగులోకి వచ్చింది. దాదాపు 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ.950 కోట్లు) విలువైన బ్యాంకు మోసానికి పాల్పడిన ఆరోపణలపై భారత సంతతికి చెందిన ఫైనాన్షియర్, వ్యాపారవేత్త మహేందర్ మఖిజానీని అమెరికా ఫెడరల్ అధికారులు అరెస్ట్ చేశారు. కాలిఫోర్నియాలోని తన విలాసవంతమైన నివాసంలో ఉన్న అతడిని బుధవారం ఉదయం సాయుధ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. టైటిల్ ఇన్సూరెన్స్ పత్రాలను నకిలీగా సృష్టించి ప్రముఖ బ్యాంకును మోసగించారనే అభియోగాలు ఆయనపై నమోదయ్యాయి. కాలిఫోర్నియా సెంట్రల్ డిస్ట్రిక్ట్ యూఎస్ అటార్నీ కార్యాలయం దాఖలు చేసిన క్రిమినల్ ఫిర్యాదు ప్రకారం, 44 ఏళ్ల మహేందర్ మఖిజానీ 2024 సెప్టెంబర్ నుంచి 2025 ఏప్రిల్ వరకు ఈ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
వివరాలు
వెస్ట్రన్ అలయన్స్ బ్యాంక్‌కార్ప్ నుంచి దాదాపు 100 మిలియన్ డాలర్ల ఋణం
తనకు చెందిన కాంటర్ గ్రూప్ V ఎల్ఎల్‌సీ సంస్థ ద్వారా వెస్ట్రన్ అలయన్స్ బ్యాంక్‌కార్ప్ నుంచి దాదాపు 100 మిలియన్ డాలర్ల రుణాన్ని పొందారు. ఇందుకోసం రియల్ ఎస్టేట్ ఆస్తులను హామీగా చూపించినప్పటికీ, వాటిపై ఇప్పటికే ఉన్న అప్పుల వివరాలను దాచిపెట్టేందుకు టైటిల్ ఇన్సూరెన్స్ పత్రాలను ఫోర్జరీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. అసలు పత్రాలను ప్రింట్ తీసి, అడోబ్ సాఫ్ట్‌వేర్ సహాయంతో మళ్లీ స్కాన్ చేసి, వాటి మెటాడేటాను మార్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ విధంగా ఆస్తులపై ఎలాంటి రుణాలు లేవని, అవి పూర్తిగా సురక్షితమైనవని బ్యాంకు అధికారులను నమ్మించి భారీ మొత్తంలో రుణాన్ని పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి.
వివరాలు
విలాసవంతమైన జీవితం.. బ్లాక్‌మెయిల్ ఆరోపణలు
ఈ మోసం ద్వారా వచ్చిన డబ్బుతో మహేందర్ మఖిజానీ అత్యంత విలాసవంతమైన జీవితం గడిపినట్లు కోర్టు పత్రాలు వెల్లడించాయి. ప్రైవేట్ జెట్లలో ప్రయాణాలు, ఖరీదైన సూపర్ కార్లు, విలాసవంతమైన భవనాల్లో నివాసం వంటి సౌకర్యాలను అనుభవించినట్లు పేర్కొన్నాయి. అంతేకాకుండా, సెక్స్ వర్కర్లు, డ్రగ్స్‌తో కూడిన పార్టీలను నిర్వహించి, వాటికి హాజరైన కొందరు బ్యాంకు ఉద్యోగులను బ్లాక్‌మెయిల్ లేదా బెదిరింపులకు గురిచేసినట్లు కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ పార్టీల ద్వారా వారిపై ప్రభావం చూపి, తన ఆర్థిక వ్యవహారాలు, మోసపూరిత కార్యకలాపాలకు ఎలాంటి అడ్డంకులు రాకుండా చూసుకున్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.
వివరాలు
మఖిజానీపై బ్యాంకు మోసం కింద ప్రధాన అభియోగం
ప్రస్తుతం మహేందర్ మఖిజానీపై బ్యాంకు మోసం కింద ఒక ప్రధాన అభియోగం నమోదైంది. ఈ ఆరోపణలు కోర్టులో రుజువైతే ఆయనకు గరిష్ఠంగా 30 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ కేసును ఎఫ్‌బీఐ, ఐఆర్ఎస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం, ఎఫ్‌డీఐసీ సహా పలు ఫెడరల్ సంస్థలు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి. మరోవైపు, ఈ మోసం వల్ల నష్టపోయిన నిధులను బ్యాంకు ఇప్పటికీ పూర్తిగా రికవరీ చేసుకోలేదని అధికారులు తెలిపారు. మహేందర్ మఖిజానీపై ఇప్పటికే ఇతర చట్టపరమైన వివాదాలు కూడా ఉన్నట్లు వెల్లడించారు.