Green Card Holder Detained: 27 ఏళ్లుగా అమెరికాలోనే.. అయినా భారత సంతతి మహిళను అదుపులోకి తీసుకున్న ఐసీఈ
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో దాదాపు 27 ఏళ్లుగా నివసిస్తున్న భారత సంతతి మహిళ వెంకట నర్సమాంబ వాసంశెట్టికి ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి అనూహ్య సమస్యలు ఎదురయ్యాయి. చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదా(గ్రీన్ కార్డు)ఉన్నప్పటికీ.. అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ)అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను అమెరికా నుంచి బహిష్కరించేందుకు సంబంధించిన కేసును కొన్ని నెలల క్రితమే ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి కొట్టివేయడం గమనార్హం. వాసంశెట్టి 2013 నుంచి అమెరికాలో చట్టబద్ధమైన శాశ్వత నివాసిగా కొనసాగుతున్నారు. ఆగస్టు 11న షెడ్యూల్ ప్రకారం ఐసీఈ కార్యాలయంలో చెక్-ఇన్ కోసం వెళ్లారు. అయితే అక్కడే అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని జార్జియాలోని నిర్బంధ కేంద్రానికి తరలించారు. ఈ పరిణామంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు
ఇప్పటికే కొట్టివేసిన బహిష్కరణ కేసు
వాసంశెట్టిపై బహిష్కరణకు సంబంధించిన కేసును ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి మే 19న కొట్టివేశారు.
ఈ కేసులో తమ ఆరోపణలకు మద్దతుగా అవసరమైన ఆధారాలను నిర్ణయించిన గడువులోగా సమర్పించడంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) విఫలమైంది.
దీంతో న్యాయమూర్తి కేసును డిస్మిస్ చేశారు. అయినప్పటికీ ఆగస్టు 11న ఆమెను ఐసీఈ అధికారులు నిర్బంధించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
వివరాలు
భారత్‌లో ఏడు నెలలు ఉండటమే కారణమా?
వాసంశెట్టిని నిర్బంధించడానికి ప్రధాన కారణం 2022లో ఆమె సుమారు ఏడు నెలల పాటు భారత్‌లో ఉండటమేనని తెలుస్తోంది.
అమెరికా ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం.. గ్రీన్ కార్డు హోల్డర్ 180 రోజులకు మించి అమెరికా వెలుపల ఉంటే, అతడు లేదా ఆమె అమెరికాలోని శాశ్వత నివాస హోదాను కొనసాగించే ఉద్దేశంలో ఉన్నారా అనే అంశాన్ని అధికారులు పరిశీలించే అవకాశం ఉంటుంది.
ఈ నిబంధనను ఆధారంగా చేసుకున్న డీహెచ్ఎస్.. వాసంశెట్టి అమెరికాలోని శాశ్వత నివాస హోదాను వదులుకున్నారని ఆరోపించింది.
అయితే ఈ ఆరోపణలను ఆమె కుటుంబ సభ్యులు, న్యాయవాది తీవ్రంగా ఖండిస్తున్నారు.
వివరాలు
తల్లిదండ్రులను చూసేందుకే భారత్‌కు..
2022 జులైలో తీవ్ర అనారోగ్యంతో ఉన్న వృద్ధ తల్లిదండ్రులను చూసేందుకు వాసంశెట్టి భారత్‌కు వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
భారత్‌లో ఉన్న సమయంలో ఆమెకు కొవిడ్ సోకిందని,ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకున్నారని వెల్లడించారు.
దీనికి తోడు ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆమె అమెరికాకు తిరిగి వెళ్లే ప్రయాణం ఆలస్యమైందని వివరించారు.
వాసంశెట్టికి అమెరికాలో కుటుంబం, ఉద్యోగం, సొంత ఇల్లు ఉన్నాయని ఆమె తరఫు న్యాయవాదులు చెబుతున్నారు.
భారత్‌కు వెళ్లడం పూర్తిగా తాత్కాలిక ప్రయాణమేనని.. అక్కడ శాశ్వతంగా స్థిరపడాలనే ఉద్దేశం ఆమెకు లేదని స్పష్టం చేస్తున్నారు.
అంతేకాదు.. ఆమె భారత్‌లో ఉన్న సమయంలోనే నార్త్ కరోలినాలో ఓ ఇంటిని కొనుగోలు చేసే ప్రక్రియను పూర్తి చేశారని గుర్తుచేస్తున్నారు.
వివరాలు
ఫెడరల్ కోర్టును ఆశ్రయించిన న్యాయవాదులు
ఇది ఆమె అమెరికాలోనే తన జీవితాన్ని కొనసాగించాలనే ఉద్దేశానికి స్పష్టమైన ఆధారమని వాదిస్తున్నారు.
ఇమ్మిగ్రేషన్ కేసు ఇప్పటికే కొట్టివేయబడినప్పటికీ వాసంశెట్టిని నిర్బంధించడంతో ఆమె న్యాయవాదులు ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు.
ఆగస్టు 13న అత్యవసర హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
ఒక వ్యక్తిని చట్టవిరుద్ధంగా నిర్బంధించారా అనే అంశాన్ని కోర్టు పరిశీలించేందుకు ఉపయోగించే న్యాయపరమైన ప్రక్రియే హెబియస్ కార్పస్.
ఈ పిటిషన్‌పై స్పందించిన న్యాయమూర్తి.. వాసంశెట్టిని నిర్బంధించడానికి ఉన్న చట్టపరమైన కారణాలను మూడు రోజుల్లోగా వివరించాలని ఇమ్మిగ్రేషన్ అధికారులను ఆదేశించారు.
వివరాలు
27 ఏళ్లుగా అమెరికాలో.. నేర చరిత్ర లేదంటున్న న్యాయవాదులు
వాసంశెట్టి దాదాపు 27 ఏళ్లుగా అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తున్నారని ఆమె న్యాయవాదులు పేర్కొంటున్నారు.
ఆమెకు ఎలాంటి నేర చరిత్ర లేదని తెలిపారు. అంతేకాకుండా ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు టీచర్‌గా ఆమె పనిచేస్తున్నారని వెల్లడించారు.
మరోవైపు వాసంశెట్టి తీవ్రమైన మధుమేహంతో బాధపడుతున్నారని, ఆమెకు నిరంతరం వైద్య పర్యవేక్షణ అవసరమని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఆమె తరఫు న్యాయపోరాటం కొనసాగుతోంది. ఫెడరల్ కోర్టు తీర్పు ఆమెకు అనుకూలంగా వస్తే.. బాండ్ హియరింగ్ ద్వారా బెయిల్ పొందే అవకాశం ఉంటుందని న్యాయవాదులు భావిస్తున్నారు.