కెనడాలో హిందూ దేవాలయంపై దాడిని పార్లమెంట్‌లో ఖండించిన భారత సంతతి ఎంపీ చంద్ర
కెనడాలో హిందూ దేవాలయంపై దాడిని భారత సంతతి ఎంపీ చంద్ర ఆర్య తీవ్రంగా ఖండించారు. ఈ దాడి అంశాన్ని కెనడా పార్లమెంట్‌లో లేవనెత్తారు. హిందూ వ్యతిరేక భావజాలం ఉన్న వ్యక్తుల వల్ల హిందూ కెనడియన్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ధోరణి మంచి కాదని, హిందూ ఆలయాలపై దాడులను ఆపేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. జనవరి 31న కెనడా బ్రాంప్టన్‌లోని గౌరీ శంకర్ మందిర్‌పై హిందూ వ్యతిరేక, భారత వ్యతిరేక భావజాల వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో ఆలయం దెబ్బతిన్నది. ఇంతకు ముందు కూడా హిందూ దేవాలయాలపై పలుమార్లు దాడులు జరిగాయి.
భౌతిక దాడులను తీవ్రంగా పరిగణించాలి: చంద్ర ఆర్య
హిందూ వ్యతిరేక భావ జాలం ఉన్న గ్రూపులు ఇది వరకు సోషల్ మీడియాలోనే తమ ద్వేషాన్ని వెల్లగక్కే వారని, ఇప్పడు ఏకంగా భౌతిక దాడులకు పాల్పడుతున్నట్లు ఎంపీ చంద్ర ఆర్య ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఏం చేస్తారోనని భయాందోళనలో హిందువులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణించాలని ప్రభుత్వాన్ని కోరారు. కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి పాస్‌పోర్ట్‌లను రద్దు చేయాలని బ్రాంప్టన్‌లోని గౌరీ శంకర్ ఆలయ వ్యవస్థాపకుడు, పూజారి భారత ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయాన్ని కెనడా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ ఒక ప్రకటనలో తెలిపారు.