
Ashley J Tellis: అమెరికాలో భారత సంతతి రక్షణ వ్యూహకర్త ఆష్లే టెల్లీస్ అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో ప్రముఖ విదేశాంగ, రక్షణ వ్యూహ నిపుణుడు,భారత సంతతికి చెందిన ఆష్లే జే. టెల్లీస్ (Ashley J. Tellis)ను అధికారులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. అమెరికా రక్షణ రహస్య పత్రాలను తన వద్ద ఉంచుకోవడమే కాకుండా, చైనా అధికారులతో రహస్య సమావేశాలు నిర్వహించినట్లు ఆయనపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యూఎస్ అధికారులు టెల్లీస్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పలు మీడియా వర్గాలు వెల్లడించాయి. యూఎస్ న్యాయవాది లిండ్సే హాలిగన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, 64 ఏళ్ల ఆష్లే టెల్లీస్ అమెరికా రక్షణ శాఖ (Department of War)లో కాంట్రాక్టర్‌గా 2001 నుంచి పనిచేస్తున్నారు. దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని చట్టవిరుద్ధంగా తన వద్ద ఉంచుకున్నట్లు విచారణలో తేలిందని తెలిపారు.
వివరాలు
యూఎస్ ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించిన పత్రాలు ప్రింట్
ఆయన నివాసం, కార్యాలయాల్లో అధికారులు సోదాలు జరిపి 'సీక్రెట్','టాప్ సీక్రెట్' అని గుర్తించబడిన వెయ్యికి పైగా రహస్య పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అంతేకాకుండా, ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న తన సహోద్యోగిని సంప్రదించి కొన్ని రహస్య పత్రాలను ప్రింట్ తీసి ఇవ్వమని టెల్లీస్ కోరినట్లు ఫెడరల్ అధికారులు పేర్కొన్నారు. ఆ ప్రకారం, యూఎస్ ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించిన సైనిక సామర్థ్యాలపై ఉన్న పత్రాలు ప్రింట్ చేసినట్లు సమాచారం.
వివరాలు
చైనా అధికారుల గిఫ్ట్‌గా బ్యాగ్
గత కొన్ని సంవత్సరాలుగా టెల్లీస్ చైనా ప్రతినిధులతో రహస్య భేటీలు జరిపినట్లు కూడా అధికారులు తెలిపారు. 2022లోనే కాకుండా, 2023 ఏప్రిల్ 11న కూడా బీజింగ్ అధికారులతో జరిగిన విందులో ఆయన పాల్గొన్నట్లు రికార్డులు చూపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఒక సమావేశంలో చైనా అధికారుల నుండి ఆయనకు ఒక బ్యాగ్ గిఫ్ట్‌గా అందినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోంది. టెల్లీస్‌పై ఉన్న ఆరోపణలు నిజమని తేలితే, ఆయనకు గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు 2,50,000 అమెరికన్ డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు ఫెడరల్ అధికారులు తెలిపారు.