
USA: హమాస్‌తో సంబంధాలు..! భారతీయ విద్యార్థిని అదుపులోకి తీసుకున్న అమెరికా పోలీసులు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా (USA) పోలీసులు భారతీయ (India) విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం.
హమాస్ ఉగ్రవాదులతో అతడికి సంబంధాలున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ అరెస్టు జరిగింది. పలు మీడియా సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
బదర్ ఖాన్ సూరి అరెస్టు వివరాలు
బదర్ ఖాన్ సూరి స్టూడెంట్ వీసాపై అమెరికాలో ఉంటున్నారు.ప్రస్తుతం వాషింగ్టన్ డీసీలోని జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్ పరిశోధకుడిగా ఉన్నారు.
అయితే,సూరి హమాస్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారని అమెరికా హోంశాఖ(DHS)అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసియా మెక్‌లాఫ్లిన్ ఆరోపించారు.
అంతేకాకుండా, ఉగ్రవాద సంస్థలోని కొన్ని కీలక వ్యక్తులతో అతడికి సంబంధాలున్నాయని తెలిపారు.
దీంతో, అతని వీసాను రద్దు చేసి, సోమవారం వర్జీనియాలోని తన ఇంటి బయట ఫెడరల్ ఏజెంట్లు అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
వివరాలు
జార్జ్‌టౌన్ యూనివర్సిటీ స్పందన
తన అరెస్టును సవాల్ చేస్తూ సూరి ఇమిగ్రేషన్ కోర్టును ఆశ్రయించారు. తనకు ఎలాంటి నేర చరిత్ర లేదని, తన భార్య పాలస్తీనా వంశానికి చెందిన కారణంగా లక్ష్యంగా చేసుకున్నారని కోర్టులో పేర్కొన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై జార్జ్‌టౌన్ యూనివర్సిటీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. "బదర్ ఖాన్ సూరి మా యూనివర్సిటీలో డాక్టోరల్ పరిశోధకుడిగా ఉన్నారు. ఆయన ఎలాంటి చట్టవిరుద్ధమైన చర్యల్లో పాల్గొన్నారా లేదా, అరెస్టు కారణం ఏమిటనేది మాకు తెలియదు. కానీ ఈ కేసుకు సంబంధించి బహిరంగ విచారణకు మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. కోర్టు న్యాయబద్ధమైన తీర్పు ఇస్తుందని ఆశిస్తున్నాం" అని పేర్కొన్నారు.
వివరాలు
పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు - ట్రంప్ సర్కారు కఠిన చర్యలు
పాలస్తీనాకు మద్దతుగా నిరసనలు చేస్తున్న విద్యార్థులపై ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.
2024 ఏప్రిల్‌లో అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో పాలస్తీనాకు మద్దతుగా పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి.
ఈ నిరసనల్లో దాదాపు 2,000 మంది అరెస్టయ్యారు. తాజాగా, కొలంబియా యూనివర్సిటీలో జరిగిన నిరసనల్లో పాలస్తీనాకు మద్దతుగా మాట్లాడిన భారతీయ విద్యార్థిని రంజనీ శ్రీనివాసన్ పై కూడా చర్యలు తీసుకున్నారు.
ఆమె వీసాను డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) రద్దు చేయడంతో స్వీయ బహిష్కరణకు గురయ్యారని అధికారులు ప్రకటించారు.