Loading...
Indonesia:  19 వేల యూట్యూబ్ ఛానళ్లు తొలగింపు.. గూగుల్‌ను వివరణ కోరిన ఇండోనేషియా
19 వేల యూట్యూబ్ ఛానళ్లు తొలగింపు.. గూగుల్‌ను వివరణ కోరిన ఇండోనేషియా

Indonesia:  19 వేల యూట్యూబ్ ఛానళ్లు తొలగింపు.. గూగుల్‌ను వివరణ కోరిన ఇండోనేషియా

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2026
10:58 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండోనేషియా ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న 19వేలకు పైగా యూట్యూబ్ ఛానళ్లను తొలగించడంపై ఆ దేశ డిజిటల్ మంత్రిత్వ శాఖ గూగుల్‌ను వివరణ కోరింది. ఈ చర్య వెనుక ఉన్న కారణాలను పూర్తిస్థాయిలో వెల్లడించాలని శుక్రవారం గూగుల్‌ను కోరినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. సరైన వివరణ లేకుండా ఇలాంటి చర్యలు తీసుకుంటే ప్రజల్లో తప్పుడు అభిప్రాయాలు ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొంది. గూగుల్ ప్రతి మూడు నెలలకు ఒకసారి'ఇన్‌ఫ్లుయెన్స్ ఆపరేషన్స్ బులెటిన్' పేరుతో నివేదిక విడుదల చేస్తుంది. వివిధ దేశాలకు సంబంధించిన సమన్వయంతో కూడిన ప్రభావ కార్యకలాపాల్లో భాగంగా పనిచేస్తున్నట్లు గుర్తించిన ఖాతాలను తొలగించిన వివరాలను ఇందులో వెల్లడిస్తుంది. చైనా,భారత్,ఇండోనేషియా తదితర దేశాలకు చెందిన ఖాతాలపై తీసుకున్న చర్యలను కూడా ఈ నివేదికలో పొందుపరుస్తుంది.

వివరాలు 

తొలగించిన ఛానళ్ల సంఖ్యలో ఇండోనేషియా మొదటి స్థానం

ఈ ఏడాది మూడో త్రైమాసికానికి సంబంధించిన నివేదికను అక్టోబర్ 30న గూగుల్ విడుదల చేసింది.

ఇందులో జులై నుంచి సెప్టెంబర్ వరకు ఇండోనేషియా ప్రభుత్వానికి, ఆ దేశ పరిపాలనకు మద్దతుగా ఉన్న 19 వేలకు పైగా యూట్యూబ్ ఛానళ్లను తొలగించినట్లు పేర్కొంది.

తొలగించిన ఛానళ్ల సంఖ్యలో ఇండోనేషియా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత చైనా, రష్యా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో గూగుల్ ఇండోనేషియా ప్రతినిధులతో సమావేశమైన ఆ దేశ డిజిటల్ మంత్రిత్వ శాఖ.. ఛానళ్ల తొలగింపునకు అనుసరించిన విధానంపై వివరాలు కోరింది.

ఖాతాలను గుర్తించే పద్ధతి, వాటిని సమీక్షించే ప్రక్రియ, సమాచార కచ్చితత్వాన్ని ఎలా నిర్ధారిస్తారు, గుర్తింపులో ఎలాంటి పొరపాట్లు జరిగే అవకాశం ఉంది అనే అంశాలను వెల్లడించాలని కోరినట్లు తెలిపింది.

వివరాలు 

స్పందించని గూగుల్

"తొలగించిన ఖాతాలను గుర్తించడానికి, వాటిపై చర్యలు తీసుకోవడానికి ఉపయోగించిన ప్రమాణాలు, విధానాలను వివరించే లిఖితపూర్వక నివేదిక ఇవ్వాలని గూగుల్‌ను కోరాం. ఇందుకు సంబంధించిన కొన్ని ఉదాహరణలను కూడా అందించాలని అడిగాం" అని మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి మెడియోడెచ్చి లుస్తారిని తెలిపారు.

అంతేకాకుండా కంటెంట్ సృష్టించిన వ్యక్తులు లేదా చర్యలకు బాధ్యులైన నిర్వాహకులు ఏ ప్రాంతానికి చెందినవారో గూగుల్ ఎలా గుర్తించిందని కూడా ప్రశ్నించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

అయితే ఈ అంశాలపై గూగుల్ వెంటనే స్పందించలేదు.

ఛానళ్ల తొలగింపునకు ఉపయోగించిన ప్రమాణాలు, మూడో త్రైమాసికంలో తొలగింపుల సంఖ్య భారీగా పెరగడానికి కారణాలు, ఇండోనేషియా ప్రభుత్వం కోరిన వివరణపై స్పందన ఇవ్వాలని కోరినా సమాధానం రాలేదు.

ADVERTISEMENT

వివరాలు 

తగ్గుతున్న ఇండోనేషియా అధ్యక్షుడి ప్రజాదరణ

మరోవైపు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ప్రజాదరణ ఇటీవలి కాలంలో తగ్గుతోంది.

దేశ ఆర్థిక పరిస్థితి, ఆయన ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాల అమలుపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నట్లు సర్వేలు సూచిస్తున్నాయి.

గతేడాది నవంబర్‌లో సుమారు 80 శాతంగా ఉన్న ఆయన ప్రజాదరణ.. ఈ ఏడాది జులై నాటికి 51 శాతానికి పడిపోయింది.

గూగుల్ తన తాజా నివేదికలో పరిశీలించిన నెలల్లో జులై కూడా ఒకటి కావడం గమనార్హం.

అయితే ఇండోనేషియాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు, ఛానళ్ల తొలగింపునకు మధ్య ఏదైనా సంబంధం ఉందని గూగుల్ తన నివేదికలో పేర్కొనలేదు.

తొలగించిన ఛానళ్లు ఒకే ప్రణాళికతో ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఎలా గుర్తించిందో కూడా గూగుల్ వెల్లడించలేదు.

ADVERTISEMENT