
Mystery Disease: మలేషియాలో 6,000 మంది విద్యార్థులకు ఇన్ఫ్లుఎంజా.. స్కూళ్లు మూసివేత..
ఈ వార్తాకథనం ఏంటి
మలేషియాలో విద్యార్థుల మధ్య వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒక రహస్య వ్యాధి కలకలం రేపుతోంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు సుమారు 6,000 మంది విద్యార్థులు ఆస్పత్రుల్లో చేరారు. ఈ పరిస్థితి ప్రజల్లో ఆందోళన, భయభ్రాంతులకు దారితీసింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు పాఠశాలలు, కళాశాలలు తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించారు. ఇది కొవిడ్-19 కొత్త రూపమా, లేక మరొక తెలియని వైరసా అనే దానిపై వైద్య నిపుణులు పరిశోధనలు కొనసాగిస్తున్నారు.
వివరాలు
నిర్వహించిన పరీక్షల్లో ఫలితాలు నెగెటివ్
మలేషియాలోని ప్రధాన పట్టణాల్లోని అనేక విద్యాసంస్థల్లో ఈ వ్యాధి వ్యాప్తి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. తాజా వివరాల ప్రకారం, కేవలం గత వారం రోజుల్లోనే దాదాపు 5,800 మంది విద్యార్థులు, 200 మంది ఉపాధ్యాయులు ఈ రోగానికి గురయ్యారు. ప్రారంభంలో లేఖన్, సెలంగూర్ ప్రాంతాల్లో మొదలైన ఈ ఇన్ఫెక్షన్ ఇప్పుడు ఇతర జిల్లాలకు విస్తరించే ప్రమాదం ఉందని ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వ్యాధి లక్షణాలు కొవిడ్-19తో చాలా దగ్గరగా ఉన్నప్పటికీ, నిర్వహించిన పరీక్షల్లో ఫలితాలు నెగెటివ్‌గా వస్తున్నాయి. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చని లేదా బ్యాక్టీరియల్ మూలం ఉండవచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు.
వివరాలు
ఇన్ఫెక్ట్ అయిన విద్యార్థుల్లో కనిపిస్తున్న సాధారణ లక్షణాలు:
అధిక జ్వరం దగ్గు,గొంతునొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తీవ్రమైన అలసట కొందరికి చర్మంపై దద్దుర్లు, కళ్లలో దురద ఈ లక్షణాలు కొవిడ్ లక్షణాలతో చాలా పోలికలు చూపిస్తున్నప్పటికీ, PCR, యాంటిజెన్ పరీక్షలు అన్నీ నెగెటివ్‌గా వస్తున్నాయి. "ఇది కొత్త వైరస్ రూపాంతరం కావచ్చు లేదా మరొక రకమైన శ్వాస సంబంధిత వైరస్ కావచ్చు" అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యాధి ప్రధానంగా 10 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు ఉన్న విద్యార్థుల్లో కనిపిస్తున్నదని అధికారులు తెలిపారు.
వివరాలు
కొవిడ్ తరహా వైరస్ కావచ్చన్న అనుమానం
ఈ పరిణామాల నేపథ్యంలో మలేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, హాస్టళ్లు రెండు వారాల పాటు మూసివేయాలని ఆదేశించింది. "పిల్లల ఆరోగ్యం మాకు అత్యంత ప్రాధాన్యం. ఈ సమయంలో ఆన్‌లైన్ తరగతుల ద్వారా బోధన కొనసాగించాలి" అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది కొవిడ్ తరహా వైరస్ కావచ్చన్న అనుమానం ఉన్నందున, వ్యాప్తి విధానం స్పష్టంగా తెలియకపోయినా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.