Syria: సిరియా నియంత అసద్ 'ఫ్యామిలీ బంకర్' లోపల ఏమున్నాయంటే?
సిరియా రాజధాని డమాస్కస్‌ను తిరుగుబాటు దళాలు ఆక్రమించుకోవడంతో అధ్యక్షుడు బషర్-అల్-అసద్ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లడం చరిత్రలో ఒక కీలక మలుపుగా మారింది. ఈ నేపథ్యంలో, ప్రజలు డమాస్కస్‌లోని ఆయన విలాసవంతమైన నివాసంలోకి చొరబడి, ఇంట్లోని ప్లేట్లు, ఫర్నిచర్ వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అధ్యక్షుడి నివాసానికి సంబంధించిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. అందులో ఒకటిలో ఫ్యామిలీ బంకర్ దృశ్యాలు ప్రజల దృష్టిని ఆకర్షించాయి. ఈ బంకర్‌లో సొరంగ మార్గం బయటపడిందని, అక్కడ బంగారు ఆభరణాలు, ఆయుధాల నిల్వలు ఉన్నట్లు వార్తలు చెబుతున్నాయి. ఈ వీడియోలో సొరంగం చివర విడిచిపెట్టిన పెట్టెలు, వస్తువులు, విశాలమైన గదులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
బ్యాంకులపై దాడి చేసి నగదు పెట్టెలతో పారిపోయిన తిరుగుబాటుదారులు
ఇక మరో వీడియోలో, అధ్యక్షుడి ప్రైవేటు గ్యారేజీలో పోర్ష్, లంబోర్గిని, ఫెరారీ, మెర్సిడెజ్- బెంజ్, ఆడీ వంటి విలాసవంతమైన కార్లు కనిపించడం వైరల్‌గా మారింది. అదనంగా, తిరుగుబాటుదారులు కొన్ని బ్యాంకులపై దాడి చేసి నగదు పెట్టెలతో పారిపోయినట్లు మీడియా వర్గాలు తెలియజేశాయి. సాయుధ తిరుగుబాటుదళాలు డమాస్కస్‌తో పాటు ఇతర ప్రధాన నగరాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడంతో,బషర్-అల్-అసద్ రష్యాలో ఆశ్రయం పొందుతున్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అధ్యక్షుడు దేశాన్ని విడిచిపెట్టిన వెంటనే,తిరుగుబాటుదారులు సిరియాను నిరంకుశ పాలన నుండి విముక్తి పొందినట్లు సంబరాలు జరుపుకున్నారు. 50సంవత్సరాల కుటుంబ పాలన, 13సంవత్సరాల దౌర్జన్యంతో ఎన్నో అన్యాయాలను ఎదుర్కొన్న ప్రజలు ఈ రోజుతో చీకటి కాలానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. సిరియాలో కొత్త శకం ఆరంభమైందని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయద్దు: ఘాజీ జలాలీ
తాజా పరిణామాలపై స్పందించిన సిరియా ప్రధానమంత్రి మహమ్మద్ ఘాజీ జలాలీ, ప్రతిపక్షాలకు అధికార బదిలీ చేసేందుకు సిద్ధమని వీడియో సందేశం ద్వారా తెలిపారు. తాను దేశంలోనే ఉన్నానని స్పష్టం చేస్తూ, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయొద్దని తిరుగుబాటుదారులకు విజ్ఞప్తి చేశారు.