Mojtaba Khamenei: మొజ్తబా ఆరోగ్యంపై తీవ్ర ప్రచారం.. వీడియో విడుదల చేసిన ఇరాన్
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమంగా ఉందంటూ ఇజ్రాయెల్ మీడియాలో వచ్చిన వార్తలను ఇరాన్ ఖండించింది. ఈ మేరకు ప్రభుత్వ మీడియా సంస్థ మొజ్తబా ఖమేనీకి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది. అందులో ఆయన ఆరోగ్యంగానే కనిపించారు. ఎలాంటి గాయాలు కానీ, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నట్లు కానీ కనిపించలేదు. అయితే ఈ వీడియోను ఎప్పుడు చిత్రీకరించారనే విషయాన్ని మాత్రం ఇరాన్ వెల్లడించలేదు. ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వచ్చినప్పటి నుంచి ఆయన బహిరంగంగా కనిపించలేదు. దీంతో అసలు ఆయన బతికే ఉన్నారా? అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.
వివరాలు
అంత్యక్రియలకు దూరం
దాడుల అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. మొజ్తబా ఖమేనీ గుర్తుపట్టలేని విధంగా తీవ్రంగా గాయపడ్డారని వ్యాఖ్యానించారు.
ఆయన దాదాపు 90 శాతం చనిపోయినట్లేనని కూడా పేర్కొన్నారు. ఇక ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లోనూ మొజ్తబా కనిపించలేదు.
అంతకుముందు జరిగిన ఆయన సతీమణి అంత్యక్రియలకు కూడా సుప్రీం లీడర్ హాజరు కాలేదు. అయితే భద్రతా కారణాల వల్లే ఆయన బహిరంగ కార్యక్రమాలకు, అంత్యక్రియలకు హాజరు కావడం లేదని ఇరాన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఈ పరిణామాల మధ్య మొజ్తబా ఖమేనీ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని, మరికొన్ని రోజుల్లో ఆయన మరణ వార్త విన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ శుక్రవారం ఇజ్రాయెల్ మీడియా పలు కథనాలు ప్రచురించింది.
వివరాలు
పుకార్లను ఖండించేందుకు వీడియో రిలీజ్
ఈ నేపథ్యంలోనే ఇరాన్ ప్రభుత్వం మొజ్తబా ఖమేనీ వీడియోను విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆయన ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఖండించేందుకే ఈ వీడియోను విడుదల చేసినట్లు తెలుస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో
Iran’s Mehr RELEASES VIDEO of Supreme Leader Mojtaba Khamenei for ‘FIRST TIME’ pic.twitter.com/v3Rp81VfLH
— RT (@RT_com) August 8, 2026