Loading...
Iran Attacks: ఒకవైపు దౌత్య ప్రయత్నాలు.. మరోవైపు యుద్ధం మరింత ఉధృతం!
ఒకవైపు దౌత్య ప్రయత్నాలు.. మరోవైపు యుద్ధం మరింత ఉధృతం!

Iran Attacks: ఒకవైపు దౌత్య ప్రయత్నాలు.. మరోవైపు యుద్ధం మరింత ఉధృతం!

వ్రాసిన వారు Moogati Shabari
Jul 22, 2026
03:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌-అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం మంగళవారంతో పదో రోజుకు చేరుకుంది. ఒకవైపు ఇరు దేశాలు దాడులు, ప్రతిదాడులతో తీవ్ర ఉద్రిక్తతను కొనసాగిస్తుండగా, మరోవైపు చర్చల ద్వారా ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నాలు కూడా వేగం పుంజుకుంటున్నాయి. మంగళవారం అమెరికా ఇరాన్‌కు చెందిన కీలక సైనిక స్థావరాలపై లక్ష్యబద్ధంగా వైమానిక దాడులు నిర్వహించింది. మిలటరీ కమాండ్‌ సెంటర్లు, క్షిపణులు, డ్రోన్ల ప్రయోగ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ వెల్లడించింది. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్‌ హర్మూజ్‌ జలసంధిలో ప్రయాణిస్తున్న ఓ నౌకపై దాడికి పాల్పడింది. ఈ ఘటనతో నౌకలోని సిబ్బంది అత్యవసరంగా దానిని విడిచి వెళ్లిపోయారు.

వివరాలు

అప్రమత్తమైన ప్రజలు..

ఇదే సమయంలో ఇరాన్‌లోని బెలూచిస్థాన్‌ ప్రావిన్స్‌తో పాటు ఫార్స్‌, హొర్మోజ్‌గాన్‌, ఇలామ్‌, కెర్‌మాన్‌, సిస్తాన్‌ ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది.

అమెరికాకు మద్దతుగా ఉన్న జోర్డాన్‌, బహ్రయిన్‌, కువైట్‌ దేశాల్లోని విద్యుత్‌ కేంద్రాలు, సముద్రజలాన్ని తాగునీటిగా మార్చే నిర్లవణీకరణ ప్లాంట్లపై కూడా ఇరాన్‌ డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది.

అయితే తమ వైపు దూసుకొచ్చిన ఐదు డ్రోన్లు, మూడు క్షిపణులను విజయవంతంగా కూల్చివేసినట్లు జోర్డాన్‌ ప్రకటించింది.

బహ్రయిన్‌లో ఇరాన్‌ దాడుల ముప్పు నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం హెచ్చరిక సైరన్లు మోగించగా ప్రజలను అప్రమత్తం చేశారు.

వివరాలు

రికార్డు స్థాయికి చేరిన పెట్రోల్ ధరలు..

మరోవైపు కువైట్‌ కూడా తమ దేశంలోని ఓ నిర్లవణీకరణ కేంద్రంపై సోమవారం రాత్రి ఇరాన్‌ దాడి జరిపిందని, ఆ ఘటనలో ఆ కేంద్రానికి నష్టం వాటిల్లినట్లు వెల్లడించింది.

ఇరాన్‌, అమెరికా మధ్య యుద్ధ పరిస్థితులు కొనసాగుతుండటంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మళ్లీ ఎగబాకుతున్నాయి.

బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 90 డాలర్లకు చేరువైంది. అమెరికాలో ఇప్పటికే మధ్యంతర ఎన్నికల వాతావరణం, పెరుగుతున్న ద్రవ్యోల్బణ భయాల నేపథ్యంలో పెట్రోలు ధరలు కూడా రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

గ్యాలన్‌ పెట్రోలు ధర నాలుగు డాలర్ల మార్క్‌ను తాకింది.

ADVERTISEMENT

వివరాలు

పాకిస్థాన్‌లో ఇరాన్‌ హోం మంత్రి కీలక భేటీలు..

యుద్ధం కొనసాగుతున్న వేళ ఇరాన్‌ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఎస్కందర్‌ మోమేనీ మంగళవారం పాకిస్థాన్‌లో పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసీమ్‌ మునీర్‌, ప్రధాని షాబాజ్‌ షరీఫ్‌లతో విడివిడిగా సమావేశమయ్యారు.

అయితే ఈ భేటీల్లో యుద్ధ విరమణకు సంబంధించిన ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారన్న విషయం బయటకు రాలేదు.

ఇరాన్‌, అమెరికా మధ్య మధ్యవర్తిత్వం చేస్తున్న పాకిస్థాన్‌ గత నెలలో ఇరు దేశాల మధ్య తాత్కాలిక ఒప్పందం కుదిరేలా ప్రయత్నించిన విషయం తెలిసిందే.

అయితే ఆ ఒప్పందం ఎక్కువకాలం నిలవకపోవడంతో మళ్లీ యుద్ధం ప్రారంభమైంది.

ఈ నేపథ్యంలో మరోసారి చర్చల బాట పట్టాలని పాకిస్థాన్‌ ఇరు దేశాలను కోరుతోంది.

ADVERTISEMENT

వివరాలు

ప్రధాని షాబాజ్‌ షరీఫ్‌తో చర్చలు..

సోమవారం సాయంత్రం పాకిస్థాన్‌కు చేరుకున్న ఎస్కందర్‌ మోమేనీకి పాక్‌ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మోహసిన్‌ నక్వీ స్వాగతం పలికారు.

అనంతరం ఆయన అసీమ్‌ మునీర్‌తో సమావేశమై, తర్వాత ప్రధాని షాబాజ్‌ షరీఫ్‌తో చర్చలు జరిపారు.

ఇదిలా ఉండగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో కూడా చర్చలకు తమ దేశం సిద్ధమేనని స్పష్టం చేశారు.

అయితే ఆ చర్చలు వాస్తవికత ఆధారంగా ఉండాలని షరతు విధించారు.

దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఆమోదయోగ్యంగా ఉండే ప్రతిపాదనను ఇరాన్‌ ముందుకు తీసుకురాగలదా అన్న ప్రశ్న తలెత్తుతోంది.

ఇరు దేశాల మధ్య అపనమ్మకం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో తాజా దౌత్య ప్రయత్నాలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయనేది ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT