LOADING...
Iran:హర్మూజ్‌ను మళ్లీ బ్లాక్‌ చేసిన ఇరాన్
హర్మూజ్‌ను మళ్లీ బ్లాక్‌ చేసిన ఇరాన్

Iran:హర్మూజ్‌ను మళ్లీ బ్లాక్‌ చేసిన ఇరాన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 18, 2026
02:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

హర్మూజ్‌ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. తెరిచిన 24 గంటల్లోపే తిరిగి మూసివేయడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హర్మూజ్‌ జలసంధిపై తిరిగి నియంత్రణ సాధించినట్లు ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్ శనివారం ప్రకటించింది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం కొనసాగుతున్నంత కాలం హర్మూజ్‌ ద్వారా జరిగే రాకపోకలను అడ్డుకుంటామని ఆ దేశం హెచ్చరించింది. ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు అమెరికాపై తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రభుత్వ టెలివిజన్‌లో ప్రసారమైన ప్రకటనలో, ఇరాన్ ఓడరేవులకు వచ్చే, వెళ్లే నౌకలపై నావికా దిగ్బంధనం కొనసాగించడం ద్వారా అమెరికా తన కట్టుబాట్లను ఉల్లంఘిస్తోందని ఇరాన్ సైన్యం పేర్కొంది.

వివరాలు

నౌకాయాన స్వేచ్ఛను పునరుద్ధరించాలి

ఇరాన్‌కు వచ్చే అన్ని నౌకలకు అమెరికా నౌకాయాన స్వేచ్ఛను పునరుద్ధరించే వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో హర్మూజ్ జలసంధి "కఠిన నియంత్రణ"లోనే ఉంటుందని సైన్యం తెలిపింది. ఇదే సమయంలో, లెబనాన్‌లో కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో హర్మూజ్‌ను తిరిగి తెరిచినట్లు ఇరాన్ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇరాన్‌తో సమగ్ర ఒప్పందం కుదిరే వరకు నావికా దిగ్బంధనం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ప్రభుత్వ టెలివిజన్ ప్రకటనలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కూడా హర్మూజ్‌పై కఠిన నియంత్రణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది.

Advertisement