Iran: పర్షియన్ గల్ఫ్‌లో టెన్షన్.. ఖర్గ్ ద్వీపంలో ఇరాన్ మందుపాతరలు
ఈ వార్తాకథనం ఏంటి
పర్షియన్ గల్ఫ్‌లో అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన ఖర్గ్ ద్వీపంను స్వాధీనం చేసుకునే దిశగా అమెరికా బలగాలు మోహరిస్తోందన్న వార్తలు బయటకు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ ద్వీపాన్ని కాపాడుకునేందుకు ఇరాన్ అలర్ట్ అయింది. అమెరికా దళాలు అక్కడికి చేరకుండా అడ్డుకునే లక్ష్యంతో భారీగా మందుపాతరలు అమర్చినట్లు సమాచారం. వాటితో విధ్వంసకర ఉచ్చులు కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అదనపు సైన్యాన్ని కూడా ఖర్గ్ ప్రాంతానికి తరలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.
వివరాలు
హర్మూజ్ జలసంధి పై ఒత్తిడి.. ట్రంప్ యంత్రాంగం వ్యూహం
హార్ముజ్ జలసంధిని తెరిపించేలా ఒత్తిడి తేవడానికి ఖర్గ్ ఐలాండ్‌ను కీలక సాధనంగా ఉపయోగించాలని అమెరికా యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ (Mohammad Bagher Ghalibaf) మాట్లాడుతూ, పశ్చిమాసియా ప్రాంతంలోని ఒక దేశం (ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి) సహకారంతో తమ ద్వీపాలను ఆక్రమించేందుకు శత్రువులు సన్నాహాలు చేస్తున్నారనే నిఘా సమాచారం ఉందన్నారు. శత్రు కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, వారు ఒక్క అడుగు ముందుకేసినా పశ్చిమాసియాలోని ఆ దేశానికి చెందిన కీలక మౌలిక వసతులపై నిరంతర దాడులు చేస్తామని ఘాటుగా హెచ్చరించారు.
వివరాలు
అమెరికా సైనికుల ఆచూకీ చెప్పండి: ఇరాన్ విజ్ఞప్తి
అమెరికా సైనికులు, కమాండర్ల ఆచూకీ తెలియజేయాలని పశ్చిమాసియా దేశాలకు ఇరాన్ విజ్ఞప్తి చేసింది. అమెరికా స్థావరాలపై దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో యూఎస్ సైనికులు ఇతర ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతున్నారని ఇరాన్ పేర్కొంది. అక్కడి ప్రజలు వారి వివరాలను వెల్లడించాలని, అలాగే మీ భద్రత కోసం వారిని బహిష్కరించాలని కోరింది. తమ దాడులతో అమెరికా స్థావరాలు చాలా వరకు ఖాళీ ప్రాంతాలుగా మారాయని తెలిపింది. ఇప్పటికే 13 అమెరికా సైనిక స్థావరాలు దెబ్బతిన్నాయని ఇరాన్ వెల్లడించింది. భూతల దాడులపై వస్తున్న వార్తల మధ్య అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలకు హెచ్చరికలు జారీ చేసింది. బెంజమిన్ నెతన్యాహు, డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల మీ పిల్లలను బలిచేయకండి అంటూ ఇరాన్ తీవ్ర హెచ్చరికలు చేసింది.