Page Loader
Iran- Israel: టెహ్రాన్‌లో ఇజ్రాయెల్‌ గూఢచార సంస్థ మొస్సాద్‌కు చెందిన డ్రోన్‌ ఫ్యాక్టరీని ధ్వంసం చేసిన ఇరాన్‌ 
టెహ్రాన్‌లో ఇజ్రాయెల్‌ గూఢచార సంస్థ మొస్సాద్‌కు చెందిన డ్రోన్‌ ఫ్యాక్టరీని ధ్వంసం చేసిన ఇరాన్‌

Iran- Israel: టెహ్రాన్‌లో ఇజ్రాయెల్‌ గూఢచార సంస్థ మొస్సాద్‌కు చెందిన డ్రోన్‌ ఫ్యాక్టరీని ధ్వంసం చేసిన ఇరాన్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 17, 2025
10:07 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ మునుపెన్నడూలేని స్థాయికి చేరుకుంటున్నాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతిదాడులు చేసుకుంటూ పశ్చిమాసియా ప్రాంతాన్ని యుద్ధ భూభాగంగా మార్చాయి. ఈ పరిణామాల మధ్య, ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లోని ఇజ్రాయెల్‌ గూఢచార సంస్థ మొస్సాద్‌కు చెందిన డ్రోన్ తయారీ కేంద్రాన్ని ఇరాన్‌ జాతీయ భద్రతా దళాలు ధ్వంసం చేశాయి. ఈ సమాచారం అధికారికంగా ధృవీకరించబడినట్లు ఇరానియన్‌ స్థానిక మీడియా వెల్లడించింది. పేలుడు పదార్థాలతో నిండి ఉన్న చిన్న పరిమాణంలోని డ్రోన్లను ఉపయోగించి ఇరాన్‌లోని కీలక ప్రాంతాలపై దాడి చేయాలని మొస్సాద్‌ గూఢచారులు యత్నిస్తున్నట్లు ఇరాన్‌ భద్రతా సంస్థలు ఆరోపించాయి. ఈ కుట్రలో భాగంగా పని చేస్తున్నారనే అనుమానంతో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు కూడా వెల్లడించారు.

వివరాలు 

ఇరాన్‌కు చెందిన పలువురు కీలక నాయకులు మృతి 

ధ్వంసమైన ఫ్యాక్టరీ నుంచి 200 కిలోలకుపైగా పేలుడు పదార్థాలు,23డ్రోన్లకు సంబంధించిన విడిభాగాలు, లాంచర్లు, ఇతర సాంకేతిక పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇక, మొస్సాద్‌కు గూఢచారిగా పనిచేస్తున్న ఇస్మాయిల్‌ ఫెక్రీ అనే వ్యక్తిని ఇరాన్‌ ప్రభుత్వానికి చెందిన న్యాయవ్యవస్థ సోమవారం ఉరిశిక్ష అమలు చేసింది. ఈ నెల 13న ఇజ్రాయెల్‌ తమ వైమానిక దళాల ద్వారా ఇరాన్‌పై దాడులకు శ్రీకారం చుట్టింది. అప్పటి నుంచే ఇరాన్‌, ఇజ్రాయెల్‌ పరస్పరం క్షిపణి దాడులు చేసుకుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా ప్రాంతం తీవ్రమైన అశాంతికి లోనైంది. ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ఇరాన్‌కు చెందిన పలువురు కీలక నాయకులు మరణించినట్లు సమాచారం. దీనికి ప్రతిగా, టెహ్రాన్‌ తన క్షిపణులతో ఇజ్రాయెల్‌లోని పౌర ప్రాంతాలపై దాడులు ప్రారంభించింది.

వివరాలు 

ఇరాన్‌కు చెందిన అధికారిక టెలివిజన్‌ భవనంపై ఇజ్రాయెల్‌ క్షిపణి దాడి

ఈ చర్యలను తీవ్రమైనవిగా భావించిన ఇజ్రాయెల్‌ తమ ప్రతిస్పందనను మరింత ముమ్మరం చేసింది. ఈ క్రమంలో, సోమవారం ఇరాన్‌కు చెందిన అధికారిక టెలివిజన్‌ భవనంపై ఇజ్రాయెల్‌ క్షిపణి దాడి జరిపింది. ఈ దాడి జరిగిన సమయంలో స్టూడియోలో ఒక మహిళా న్యూస్‌ రీడర్‌ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వార్తలు చదువుతుండటం గమనార్హం. అంతేకాకుండా, ఇరాన్‌ విసిరిన ఒక క్షిపణి టెల్‌ అవీవ్‌లోని అమెరికా రాయబారి కార్యాలయాన్ని తాకినట్లు సమాచారం. దీంతో కార్యాలయం స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, అక్కడి సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.