Iran-Ukraine: కాస్పియన్ సముద్ర ఉద్రిక్తతల ప్రభావం.. ఉక్రెయిన్‌పై ప్రతీకారానికి సిద్ధమైన ఇరాన్!
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, మరోవైపు కొనసాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం కలిసి ప్రాంతీయ ఘర్షణలను మరింత విస్తరించే ప్రమాదంపై అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై ప్రతీకార చర్యకు ఇరాన్ సిద్ధమైనట్లు అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ సంచలన కథనం ప్రచురించింది. ఉక్రెయిన్‌లోని ఒక ఓడరేవును లక్ష్యంగా చేసుకుని దాడి చేసేందుకు టెహ్రాన్ ప్రణాళిక రూపొందించినట్లు ఆ కథనంలో పేర్కొంది. హర్మూజ్ జలసంధిలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా కాస్పియన్ సముద్రం ప్రస్తుతం ఇరాన్‌కు అత్యంత కీలకమైన వాణిజ్య మార్గంగా మారింది. అయితే ఈ సముద్ర మార్గంలో ప్రయాణిస్తున్న నౌకలపై ఉక్రెయిన్ దాడులకు పాల్పడటం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది.
వివరాలు
ఇరాన్ వాణిజ్య నౌకపై ఉక్రెయిన్ దాడి
గత వారం ఇరాన్‌కు చెందిన ఓ వాణిజ్య నౌకపై ఉక్రెయిన్ జరిపిన దాడిలో ఒక నావికుడు మరణించినట్లు సమాచారం.
ఈ ఘటనను టెహ్రాన్ తీవ్రంగా పరిగణించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.
దీనికి ప్రతీకారంగా నల్ల సముద్రంలోని ఉక్రెయిన్‌కు చెందిన ఒక ఓడరేవును లక్ష్యంగా చేసుకుని చిన్న శ్రేణి బాలిస్టిక్ క్షిపణితో దాడి చేయాలని ఇరాన్ యోచించినట్లు తెలిపాయి.
ఈ దాడి ద్వారా పెద్ద ఎత్తున నష్టం కలిగించడం కంటే,ఉక్రెయిన్‌కు హెచ్చరిక పంపడమే ప్రధాన ఉద్దేశంగా టెహ్రాన్ భావించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఒకవేళ ఈ దాడి జరిగి ఉంటే ఉక్రెయిన్ ఎలా స్పందించేదన్నది స్పష్టంగా చెప్పలేమని,పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారి యుద్ధం విస్తరించే అవకాశముందని పశ్చిమ దేశాలు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.
వివరాలు
ప్రతీకార చర్యల విషయంలో వెనక్కి తగ్గిన టెహ్రాన్
అయితే దౌత్య చర్చలతో పరిస్థితి ప్రస్తుతానికి చల్లబడినట్లు తెలుస్తోంది.
కాస్పియన్ సముద్రంలో ఏర్పడిన ఉద్రిక్తతలపై చర్చించేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాసీ అరాగ్చీ మంగళవారం ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహాతో ఫోన్‌లో మాట్లాడారు.
ఈ సందర్భంగా వాణిజ్య నౌకపై జరిగిన దాడి ఉద్దేశపూర్వకంగా కాదని ఉక్రెయిన్ మంత్రి వివరణ ఇచ్చినట్లు సమాచారం.
దీంతో ప్రతీకార చర్యల విషయంలో టెహ్రాన్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
ఫోన్ సంభాషణ అనంతరం అరాగ్చీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు.
అయితే తమ దేశ ప్రయోజనాలు, పౌరుల భద్రతపై జరిగే దాడులను ఏ పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని, జరిగిన నష్టానికి తగిన పరిహారం తప్పనిసరిగా చెల్లించాల్సిందేనని పేర్కొన్నారు.
వివరాలు
ఇరాన్ వాణిజ్య నౌకకు నష్టపరిహారం చెల్లించేందుకు ఉక్రెయిన్ అంగీకారం
ఇదిలా ఉండగా, దాడిలో ధ్వంసమైన ఇరాన్ వాణిజ్య నౌకకు సంబంధించిన నష్టపరిహారం చెల్లించేందుకు ఉక్రెయిన్ అంగీకరించినట్లు సమాచారం.
అయినప్పటికీ ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పూర్తిగా ముగిసిపోయాయని చెప్పడం ఇప్పుడే సాధ్యం కాదని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.