Iran : ఇరాన్‌లో మరణశిక్షల పెరుగుదలను ఖండించిన ఐక్యరాజ్య సమితి..7 నెలల్లోనే 419 కేసులు
ఇరాన్‌లో భారీగా మరణశిక్షలు విధించినట్లు యూఎన్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఈ ఏడు తొలి ఏడు నెలల్లోనే 419 మందికి మరణశిక్ష అమలైనట్లు ఐక్యరాజ్య సమితి నివేదించింది. మరణశిక్షలపై ప్రపంచ వ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతున్న వేళ, ఇరాన్‌లో ఆందోళనకర స్థాయిలో మరణదండనలు విధిస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి 30 శాతం మేర క్యాపిటల్ పనిష్మెంట్లు పెరిగాయని వివరించింది. గత నాలుగేళ్లుగా ఇరాన్ దేశంలో ఏటా అమలవుతున్న మరణ శిక్షల్లో 25 శాతం పెరుగుదల నమోదవుతుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తోంది.
మరణిశిక్షలను ఖండించిన ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్
ఇరాన్ ఊహించని స్థాయిలో మరణశిక్షలను అమలు చేయడాన్ని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరస్ తీవ్రంగా పరిగణించారు. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలకు లోబడి సదరు దేశంలో విచారణ ప్రక్రియలు జరగట్లేదనే విషయం అర్థమైందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు నమోదైన కేసుల విచారణల్లోనూ పారదర్శకత, స్వతంత్ర దర్యాప్తు విధానం లేదన్నారు. ఈ నేపథ్యంలో సుమారు 20 వేల మంది సామాన్య ప్రజలను అరెస్ట్ చేసి నిర్బంధించినట్లు తమకు సమాచారం ఉందన్నారు. అరెస్ట్ అయిన వారిలో ఎక్కువగా 15 ఏళ్ల వయసు యువకులే ఉండటం ఆందోళనకర పరిణామన్నారు. మహిళలు, జర్నలిస్టులు, న్యాయవాదులే లక్ష్యంగా అరెస్టులు జరిగినట్లు పేర్కొన్నారు. దేశ భద్రత పేరిట మరణశిక్షలను ఇరాన్ సమర్థించడాన్ని ఒప్పుకోమన్నారు.