Iran: సెజ్జిల్-2తో షాక్ ఇచ్చిన ఇరాన్.. అమెరికా, ఇజ్రాయెల్‌లో ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మెరుపుదాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్‌లో తాము ముందుగానే గుర్తించిన లక్ష్యాలను వీరు ధ్వంసం చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాల మధ్య అమెరికా, ఇజ్రాయెల్‌కు ఆందోళన కలిగించేలా ఇరాన్ యుద్ధంలో తొలిసారి ఒక కీలక అస్త్రాన్ని వినియోగించినట్లు ఇరాన్ మీడియా సంస్థ ప్రెస్‌టీవీ వెల్లడించింది. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై యుద్ధ చర్యలు మొదలైనట్లు చెబుతుండగా, ఆదివారం నాడు ఇరాన్ ఈ అస్త్రాన్ని బయటకు తీసి ప్రయోగించినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఇరాన్ క్షిపణి సామర్థ్యాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఇజ్రాయెల్, అమెరికాకు షాక్ ఇచ్చేలా ఇరాన్ ఇటీవల రెండు దశల బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేసి పరీక్షించింది.
వివరాలు
ఏమిటి సెజ్జిల్-2 ప్రత్యేకత?
వాటిలో అత్యంత ప్రాధాన్యం పొందింది సెజ్జిల్ బాలిస్టిక్ క్షిపణి. పరిమాణంలో చిన్నగా కనిపించినప్పటికీ, దాని విస్ఫోటన శక్తి చాలా భారీగా ఉంటుందని చెబుతున్నారు. సెజ్జిల్‌తో పాటు అషురా వంటి మరికొన్ని క్షిపణులు కూడా ఇరాన్ వద్ద ఉన్నాయి. సెజ్జిల్-2 రెండు దశలతో పనిచేసే ఘన ఇంధన మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి. దీని పొడవు 18 మీటర్లు కాగా,వ్యాసం 1.25మీటర్లు ఉంటుంది. మొత్తం బరువు 23,600 కిలోలు.ఇది సుమారు 2,000కిలోమీటర్ల పరిధిలో దాదాపు 700కిలోల పేలోడ్‌ను మోయగల సామర్థ్యం కలిగి ఉంది. అధిక ఎత్తులో ప్రయాణించే సమయంలో దిశ మార్చుకునే సామర్థ్యం ఉండటంతో దీనిని 'డ్యాన్సింగ్ మిసైల్'అని కూడా పిలుస్తారు. ఈ లక్షణం కారణంగా ఐరన్‌డోమ్ వంటి రక్షణ వ్యవస్థలను తప్పించుకునే అవకాశముందని భావిస్తున్నారు.
వివరాలు
ఘన ఇంధనంతో వ్యూహాత్మక ఆధిక్యం
సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) వివరాల ప్రకారం, సెజ్జిల్ క్షిపణిలో ఉపయోగించిన ఘన ఇంధన సాంకేతికత ఇరాన్‌కు వ్యూహాత్మకంగా మేలు చేస్తుంది. ఇది పాత షహాబ్ సిరీస్‌కు చెందిన ద్రవ ఇంధన క్షిపణులతో పోలిస్తే వేగంగా సిద్ధమవుతుంది. అలాగే తక్షణ ప్రయోగానికి కూడా అనుకూలంగా ఉంటుంది.
వివరాలు
1990ల నుంచే రూపకల్పన.. వరుస పరీక్షలు
సెజ్జిల్ క్షిపణి రూపకల్పనపై ఇరాన్ 1990ల ప్రారంభంలోనే పని మొదలుపెట్టింది. 2008లో దీని తొలి పరీక్ష నిర్వహించగా, ఆ సమయంలో క్షిపణి దాదాపు 800 కిలోమీటర్లు ప్రయాణించినట్లు తెలుస్తోంది. 2009లో జరిగిన రెండో పరీక్షలో మార్గదర్శక వ్యవస్థలను పరిశీలించారు. ఆ తర్వాత 2009 నుంచి మరో నాలుగు అదనపు పరీక్షలు కూడా నిర్వహించారు. ఆరవ పరీక్షలో ఈ క్షిపణి దాదాపు 1,900 కిలోమీటర్లు ప్రయాణించి హిందూ మహాసముద్రంలో పడినట్లు సమాచారం. ప్రస్తుతం యుద్ధ పరిస్థితుల్లో ఇరాన్ సెజ్జిల్ క్షిపణిని వినియోగించడం అమెరికా, ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలకు కొత్త సవాలుగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు.