LOADING...
Kuwait Airport: కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్ దాడి.. ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం
కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్ దాడి.. ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం

Kuwait Airport: కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్ దాడి.. ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2026
10:54 am

ఈ వార్తాకథనం ఏంటి

గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ వరుస దాడులకు దిగుతోంది. ఈ క్రమంలో తాజాగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరిపినట్లు కువైట్ సైన్యం వెల్లడించింది. ఈ దాడి కారణంగా విమానాశ్రయ ఆస్తులకు గణనీయమైన నష్టం వాటిల్లిందని, పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. భద్రతా కారణాల దృష్ట్యా విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు కువైట్ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకటించింది. అలాగే కువైట్‌కు రావాల్సిన కొన్ని అంతర్జాతీయ విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించినట్లు వెల్లడించింది.

వివరాలు 

అమెరికా దాడులకు ప్రతీకారమే: ఐఆర్‌జీసీ

ఇరాన్‌లోని గెరుక్, ఖేష్మ్ ద్వీపాలపై అమెరికా శని, ఆదివారాల్లో నిర్వహించిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యలు చేపట్టినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. కువైట్‌లోని అల్ సలేమ్ వైమానిక స్థావరం, బహ్రెయిన్‌లోని ఇసా ఎయిర్‌బేస్‌తో పాటు మరికొన్ని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. అమెరికా చర్యలు కొనసాగితే తమ దాడులు కూడా కొనసాగుతాయని స్పష్టం చేసిన ఐఆర్‌జీసీ, హర్మూజ్ జలసంధి భద్రతకు ఎలాంటి అంతరాయం కలిగినా అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

వివరాలు 

ప్రజలకు హెచ్చరికలు

ఇరాన్ దాడుల నేపథ్యంలో కువైట్, బహ్రెయిన్ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావొద్దని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించాయి. భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేసినట్లు కూడా వెల్లడించాయి. క్షిపణులు, డ్రోన్‌లను కూల్చివేసిన అమెరికా మరోవైపు, హర్మూజ్ ప్రాంతం మీదుగా ఇరాన్‌కు వెళ్తున్న ఒక నౌకపై దాడి చేసినట్లు అమెరికా సైన్యం తెలిపింది. అలాగే గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రయోగించిన పలు బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్‌లను విజయవంతంగా అడ్డుకుని కూల్చివేసినట్లు వెల్లడించింది. దీంతో గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

Advertisement