Strait of Hormuz: హర్మూజ్‌లో చమురు ట్యాంకర్‌పై ఇరాన్ క్షిపణి దాడి.. పెరిగిన ఉద్రిక్తతలు
ఈ వార్తాకథనం ఏంటి
హర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కీలక జలమార్గంలో ప్రయాణిస్తున్న ఓ చమురు ట్యాంకర్‌ను ఇరాన్ క్షిపణులతో లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. దాడి అనంతరం నౌకలో భారీగా మంటలు చెలరేగాయి. సమీపంలో ఉన్న మరో చమురు నౌక కూడా ఈ ఘటనలో స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. అయితే దాడికి గురైన ట్యాంకర్లు ఏ దేశానికి చెందినవన్నది, వాటిలో ఉన్న సిబ్బంది పరిస్థితి ఏమిటన్నది ఇంకా స్పష్టత రాలేదు. హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు సంబంధించి అమెరికా, ఒమన్ మధ్య చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. హర్మూజ్‌లో నౌకా రవాణా ఇప్పటికే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాజా దాడి ఆందోళనలను మరింత పెంచింది.
వివరాలు
సౌదీపై హూతీల దాడి
మరోవైపు.. దక్షిణ ఇరాన్ గగనతలంలో సంచరిస్తున్న అమెరికాకు చెందిన ఎంక్యూ-9 డ్రోన్‌ను ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) దళాలు కూల్చివేసినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో డ్రోన్ కూల్చివేత కూడా పరిస్థితిని మరింత సున్నితంగా మార్చింది.
ఇలాంటి డ్రోన్ కూల్చివేతలను ఇరాన్ గతంలోనూ ప్రకటించింది.
ఇదిలా ఉండగా.. సౌదీ అరేబియా, యెమెన్‌కు చెందిన హూతీల మధ్య ఘర్షణలు మరోసారి తీవ్రతరం అయ్యాయి.
సౌదీ సైనికులను లక్ష్యంగా చేసుకుని ఓడరేవుపై జరిగిన దాడుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
మరోవైపు సౌదీ అరేబియాలోని అరామ్‌కోకు చెందిన జాజన్ చమురు శుద్ధి కేంద్రంపైనా హూతీలు క్షిపణులు, డ్రోన్లతో దాడికి పాల్పడ్డారు.
వివరాలు
పాకిస్థాన్,తుర్కియే, సౌదీ అరేబియా ఇటీవల 'మక్కా ఒప్పందం'పై సంతకాలు
ఈ దాడి కారణంగా రిఫైనరీ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో చమురు శుద్ధి కేంద్రం కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఈ దాడుల్లో జరిగిన పూర్తి ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడికాలేదు.
జాజన్ రిఫైనరీ రోజుకు సుమారు 4లక్షల బ్యారెళ్ల ముడిచమురును శుద్ధి చేసే సామర్థ్యం కలిగిన కీలక కేంద్రంగా ఉంది.
గతంలోనూ హూతీల దాడులతో ఈ ప్రాంతంలోని చమురు మౌలిక వసతులు ప్రభావితమయ్యాయి.
కాగా.. పాకిస్థాన్,తుర్కియే, సౌదీ అరేబియా ఇటీవల 'మక్కా ఒప్పందం'పై సంతకాలు చేశాయి.
ఈ ఒప్పందం ప్రకారం మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపైనైనా దాడి జరిగితే.. దాన్ని మిగిలిన రెండు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణించి ఉమ్మడిగా స్పందించాలనే రక్షణ సహకారానికి అంగీకరించాయి.
వివరాలు
ఒప్పందం కుదిరిన కొద్ది రోజులకే సౌదీపై హూతీల దాడులు
ఈ ఒప్పందం కుదిరిన కొద్ది రోజులకే హూతీలు సౌదీపై దాడులకు పాల్పడటం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.
తాజా పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్, తుర్కియే ఎలా స్పందిస్తాయి? మక్కా ఒప్పందం అమలులోకి వస్తుందా? అనే అంశాలపై ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు హర్మూజ్ జలసంధిలో ఇరాన్ చర్యలు, సౌదీపై హూతీల దాడులు కొనసాగుతుండటంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.