Strait Of Hormuz: హర్మూజ్ కిందున్న సముద్రగర్భ కేబుళ్లపై కన్నేసిన ఇరాన్.. అమెరికా టెక్ దిగ్గజాల నుంచి వసూళ్లు..?
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల హర్మూజ్ జలసంధి అంశంతో ప్రపంచ దేశాలకు చమురు భయాందోళనలు కలిగించిన ఇరాన్.. ఇప్పుడు మరో కీలక నిర్ణయంతో ప్రపంచాన్ని కలవరపెడుతోంది. హర్మూజ్ జలసంధి కిందుగా వెళ్లే సముద్రగర్భ అంతర్జాల కేబుళ్ల వినియోగంపై రుసుములు విధించే దిశగా టెహ్రాన్ చర్యలు చేపడుతున్నట్లు అక్కడి అధికార మాధ్యమాలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాల సేవలకు కీలకమైన సముద్రగర్భ కేబుళ్లను హర్మూజ్ మార్గం ద్వారా వినియోగిస్తున్న గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి సాంకేతిక దిగ్గజ సంస్థలపై లైసెన్సు రుసుములు విధించాలని ఇరాన్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు,ఈ సంస్థలు ఇరాన్ నిబంధనలకు లోబడి పనిచేయాలని,కేబుళ్ల నిర్వహణతో పాటు మరమ్మతుల హక్కులను కూడా ఇరాన్‌కు చెందిన సంస్థలకే అప్పగించే విధంగా కొత్త విధానాలు రూపొందిస్తున్నట్లు కథనాలు చెబుతున్నాయి.
వివరాలు
రుసుములు చెల్లించని సంస్థలు డేటా రాకపోకల్లో అంతరాయాలు ఎదుర్కొనే అవకాశం
ఈ రుసుములను ఎలా వసూలు చేస్తారు..? ఎంత మొత్తంలో ఉంటాయి..? అన్న అంశాలపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. అయితే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్‌కు అనుబంధ మాధ్యమాల్లో ఈ కథనం వెలువడటంతో అంతర్జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. రుసుములు చెల్లించని సంస్థలు డేటా రాకపోకల్లో అంతరాయాలు ఎదుర్కొనే అవకాశముందని కూడా హెచ్చరికలు రావడం గమనార్హం. గత వారం కూడా ఇరాన్ సైనిక వ్యవస్థకు చెందిన ప్రతినిధి సామాజిక మాధ్యమ వేదికలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం అమెరికా ఆంక్షలు అమల్లో ఉండటంతో ఇరాన్‌కు అమెరికా సంస్థలు నేరుగా చెల్లింపులు చేయలేని పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే ప్రపంచ సాంకేతిక సంస్థలు ఎలా స్పందిస్తాయన్నదానిపై ఆసక్తి నెలకొంది.
వివరాలు
ప్రపంచ డిజిటల్ వ్యవస్థపై ప్రభావం..!
ప్రపంచ దేశాల మధ్య అంతర్జాల అనుసంధానానికి సముద్రగర్భ కేబుళ్లే ప్రధాన ఆధారం. అంతర్జాల సేవలు, డేటా మార్పిడి, ఆర్థిక లావాదేవీలు, రక్షణ వ్యవస్థల సమాచార మార్పిడి, కృత్రిమ మేధ సేవలు అన్నీ వీటిపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ కేబుళ్లకు నష్టం జరిగినా లేదా డేటా రాకపోకల్లో అంతరాయం ఏర్పడినా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. భారత్‌కు వచ్చే అధిక భాగం అంతర్జాల రాకపోకలు కూడా హర్మూజ్ జలసంధి మార్గంలోనే జరుగుతున్నాయి. అలాగే ఆసియాలోని ముఖ్య డేటా కేంద్రాలను ఐరోపా దేశాలతో అనుసంధానించే పలు ప్రధాన కేబుళ్లు కూడా ఇదే మార్గంలో ఉన్నాయి. దీంతో ఇరాన్ తాజా నిర్ణయాలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
వివరాలు
ఇరాన్‌కు నిజంగా ఆ హక్కు ఉందా..?
1982లో రూపొందించిన సముద్ర చట్టాలపై ఐక్యరాజ్య సమితి ఒప్పందం ప్రకారం తీరప్రాంత దేశాలు తమ ప్రాదేశిక జలాల్లోకి వచ్చే కేబుళ్లు,పైప్‌లైన్‌లపై కొన్ని నిబంధనలు విధించే అవకాశం ఉంటుంది. ఇరాన్ ఈ ఒప్పందంపై సంతకం చేసినప్పటికీ ఇప్పటివరకు అధికారికంగా ఆమోదించలేదు. ప్రస్తుతం సూయజ్ కాలువ మీదుగా వెళ్లే సముద్రగర్భ కేబుళ్లపై ఈజిప్టు రుసుములు వసూలు చేస్తోంది. అదే ఉదాహరణను చూపిస్తూ హర్మూజ్ జలసంధిలో కూడా వసూళ్లు చేపట్టాలని ఇరాన్ భావిస్తోంది. అయితే సూయజ్ కాలువ కృత్రిమంగా నిర్మించిన మార్గం కాగా,హర్మూజ్ సహజసిద్ధంగా ఏర్పడిన జలసంధి. అంతేకాదు అది పూర్తిగా ఇరాన్ ప్రాదేశిక జలాల పరిధిలోకి రాదని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇరాన్ ప్రకటనలపై ప్రపంచ సాంకేతికసంస్థలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.