LOADING...
Iran: అమెరికాకు ఇరాన్ మెసేజ్.. యుద్ధం ముగించాలంటే ఈ హామీలు తప్పనిసరి

Iran: అమెరికాకు ఇరాన్ మెసేజ్.. యుద్ధం ముగించాలంటే ఈ హామీలు తప్పనిసరి

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 01, 2026
10:27 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రకటించారు. అయితే, ఈ ప్రక్రియ సులభం కాదని స్పష్టం చేస్తూ, తమకు కొన్ని బలమైన హామీలు అవసరమని చెప్పారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాతో జరిగిన ఫోన్ సంభాషణలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేసినట్లు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. యుద్ధం ముగియాలంటే తమ షరతులను తప్పనిసరిగా అంగీకరించాల్సిందేనని ఇరాన్ స్పష్టం చేసింది. ముఖ్యంగా భవిష్యత్తులో తమపై ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండేందుకు గట్టి హామీలు ఇవ్వాలని పెజెష్కియాన్ డిమాండ్ చేశారు. అలాంటి హామీలు లభిస్తే మాత్రమే యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధమని ఆయన తెలిపారు.

వివరాలు 

ఇరాన్ అధ్యక్షుడితో చర్చ.. స్పందించిన ఆంటోనియో కోస్టా

ఇరాన్ అధ్యక్షుడితో జరిగిన చర్చ అనంతరం ఆంటోనియో కోస్టా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా ఉందని, ఇది ప్రపంచానికి ప్రమాదకర సంకేతమని ఆయన పేర్కొన్నారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరాన్ గల్ఫ్ దేశాలపై ప్రతీకార దాడులను నియంత్రించాలని ఆయన కోరారు. సమస్యకు శాంతియుత పరిష్కారం కోసం దౌత్య మార్గాలే ఉత్తమమని పిలుపునిచ్చారు. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం అత్యవసరమని ఆయన సూచించారు. ఇక మరోవైపు, అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ నుంచి తనకు నేరుగా సందేశాలు వస్తున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు.

వివరాలు 

కాల్పుల విరమణపై తాము ఆసక్తి చూపడం లేదు: అరాగ్చీ

అయితే, ఈ సందేశాలు అధికారిక చర్చల భాగంగా కాదని ఆయన స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడుతూ, కొన్ని సందేశాలు మధ్యవర్తుల ద్వారా కూడా అందినట్లు వెల్లడించారు. అమెరికాతో ప్రస్తుతం ఎలాంటి అధికారిక చర్చలు జరగడం లేదని, వారు చేసిన ప్రతిపాదనలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అరాగ్చీ చెప్పారు. ముఖ్యంగా కాల్పుల విరమణపై తాము ఆసక్తి చూపడం లేదని, యుద్ధానికి పూర్తిస్థాయి ముగింపే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Advertisement