LOADING...
Iran-Us war: అరాక్ అణు కేంద్రం ధ్వంసం చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ కఠిన హెచ్చరికలు
అరాక్ అణు కేంద్రం ధ్వంసం చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ కఠిన హెచ్చరికలు

Iran-Us war: అరాక్ అణు కేంద్రం ధ్వంసం చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ కఠిన హెచ్చరికలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 30, 2026
11:37 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌లోని రెండు కీలక అణు కేంద్రాలపై ఇటీవల జరిగిన దాడులు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇరాన్‌ముఖ్యంగా అరాక్ ప్రాంతంలో ఉన్న భారజల రియాక్టర్‌పై జరిగిన దాడి తీవ్ర ప్రభావం చూపింది. ఈ ఘటనలో భారజల ఉత్పత్తి కేంద్రం పూర్తిగా దెబ్బతిన్నట్లు అంతర్జాతీయ అణు శక్తి సంస్థ(IAEA) తాజా నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం ఆ కేంద్రంలో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయిందని పేర్కొంది. అయితే అక్కడ అణుధార్మిక పదార్థాలు ఉన్నాయని నిర్ధారించే అధికారిక సమాచారం లేదని స్పష్టం చేసింది. మార్చి 27న జరిగిన ఈ దాడులను ఇరాన్ ధ్రువీకరించింది. అయినప్పటికీ,ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని,రేడియేషన్‌ వ్యాప్తి ప్రమాదం కూడా లేదని ఇరాన్ అధికారులు తెలిపారు. ఈ దాడులకు తామే బాధ్యత వహిస్తున్నామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.

వివరాలు 

"వాళ్లే మా టార్గెట్‌" - ఇరాన్ ఘాటు హెచ్చరిక

ఇక ఉత్తర ఇరాన్‌లోని తబ్రిక్ ప్రాంతంలోని పెట్రో కెమికల్‌ ప్లాంట్‌పై కూడా దాడి జరిగినట్లు సమాచారం. చమురు, గ్యాస్‌, ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ ప్లాంట్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, తమపై జరుగుతున్న దాడులకు ప్రతీకారం తప్పదని ఇరాన్ మరోసారి గట్టిగా హెచ్చరించింది. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఉన్న అమెరికా, ఇజ్రాయెల్ సైనిక అధికారులు,రాజకీయ నాయకులే తమ లక్ష్యమని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) స్పష్టం చేసింది. "వేల కిలోమీటర్ల దూరం నుంచే అమెరికా మాపై బెదిరింపులు చేస్తోంది.వాటికి మేము బలంగా సమాధానం ఇస్తాం.ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, వారి కమాండర్లు,సైనికులు పర్షియన్ గల్ఫ్‌లోని షార్క్‌లకు ఆహారమవుతారు"అంటూ ఐఆర్‌జీసీ అధికార ప్రతినిధి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Advertisement