LOADING...
Strait of Hormuz: హర్ముజ్ జలసంధిలో నౌకలకు ఇరాన్‌ 'టోల్‌ ఫీజులు'
హర్ముజ్ జలసంధిలో నౌకలకు ఇరాన్‌ 'టోల్‌ ఫీజులు'

Strait of Hormuz: హర్ముజ్ జలసంధిలో నౌకలకు ఇరాన్‌ 'టోల్‌ ఫీజులు'

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 26, 2026
12:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధిని భారత్‌ సహా ఐదు మిత్ర దేశాల కోసం తెరిచినట్లు ఇరాన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మార్గంపై మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. హర్మూజ్‌ జలసంధి (Strait of Hormuz) గుండా ప్రయాణించే నౌకల నుంచి ఇరాన్‌ రివల్యూషనరీ గార్డులు అనధికారికంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు సమాచారం బయటపడింది. ఇందుకోసం ప్రత్యేకంగా 'టోల్‌ బూత్‌' విధానాన్ని అమలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ అంశాన్ని ప్రముఖ షిప్పింగ్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ లాయిడ్స్‌లిస్ట్‌ వెల్లడించింది.

వివరాలు 

మార్చి 13 నుంచి అమల్లో టోల్‌ విధానం

లాయిడ్స్‌లిస్ట్‌ సమాచారం ప్రకారం మార్చి 13 నుంచి ఈ టోల్‌ విధానం అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఐఆర్‌జీసీ (IRGC) రూపొందించిన ఈ టోల్‌ సిస్టమ్‌ ప్రకారం ఇప్పటివరకు 26 నౌకలు హర్మూజ్‌ జలసంధిని దాటాయి. ఆయా నౌకలు ముందుగా అవసరమైన పత్రాలు సమర్పించి, ప్రత్యేక క్లియరెన్స్‌ కోడ్‌లు పొందిన తర్వాతే ప్రయాణం కొనసాగించినట్లు పేర్కొంది. ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ నౌకలు సాధారణంగా ఉపయోగించే మార్గాల్లో కాకుండా ఇరాన్‌ అధికారులు సూచించిన ప్రత్యేక మార్గాల్లోనే ప్రయాణించాయని లాయిడ్స్‌లిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ డేటా స్పష్టం చేసింది. మార్చి 15 నుంచి హర్మూజ్‌లో సాధారణ మార్గాల్లో ఒక్క నౌక కూడా ప్రయాణించినట్లు ట్రాకింగ్‌లో గుర్తించలేదని వెల్లడించింది.

వివరాలు 

భారత్‌కు చేరిన నౌకలు.. టోల్‌ చెల్లించాయా?

ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత కూడా భారత్‌కు వస్తున్న నౌకల రాకపోకలు కొనసాగుతున్నాయి. గురువారం నాటికి భారత్‌కు చెందిన ఐదు నౌకలు హర్మూజ్‌ను సురక్షితంగా దాటాయి. వీటిలో మూడు ఇప్పటికే దేశీయ పోర్టులకు చేరుకోగా, మిగతా రెండు.. జగ్‌ వసంత్‌, పైన్‌ గ్యాస్‌.. ఈ వారాంతానికి భారత్‌కు చేరనున్నాయి. అయితే ఈ నౌకలు టోల్‌ చెల్లించాయా లేదా అన్న విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఇరాన్‌ విదేశాంగ మంత్రి చేసిన ప్రకటనలో కూడా ఈ అంశంపై ఎలాంటి ప్రస్తావన చేయలేదు.

Advertisement

వివరాలు 

2 మిలియన్‌ డాలర్ల ఫీజు వార్తలు.. ఖండించిన ఇరాన్

హర్మూజ్‌ జలసంధి గుండా వెళ్లే ప్రతి నౌక నుంచి సుమారు 2 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.18 కోట్లు) ఫీజు వసూలు చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే ఈ ఆరోపణలను భారత్‌లోని ఇరాన్‌ దౌత్య కార్యాలయం పూర్తిగా ఖండించింది. ఈ వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఫీజుల వసూళ్లపై వస్తున్న ఆరోపణలకు ఇరాన్‌ ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ఆ సమయంలో భారత్‌ కూడా ఈ వార్తలను నమ్మకూడదని పేర్కొంది. కానీ ఇప్పుడు లాయిడ్స్‌లిస్ట్‌ నివేదిక వెలువడడంతో ఈ అంశంపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి.

Advertisement

వివరాలు 

ఐదు దేశాల నౌకలకు అనుమతి

ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ ప్రకారం భారత్‌తో పాటు చైనా, రష్యా, ఇరాక్‌, పాకిస్థాన్‌ దేశాల నౌకలకు హర్మూజ్‌ జలసంధి గుండా ప్రయాణానికి అనుమతి ఇచ్చారు. దీంతో ఈ మార్గంలో ఇరుక్కుపోయిన భారత్‌ నౌకలు తమ సరుకులతో గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం కలిగింది.

Advertisement