UAE Gas Field: యూఏఈలో గ్యాస్ క్షేత్రంపై ఇరాన్ డ్రోన్ దాడి.. నిలిచిన కార్యకలాపాలు
ఈ వార్తాకథనం ఏంటి
పర్షియన్ గల్ఫ్ పరిసరాల్లో ఉన్న ఇంధన మౌలిక వసతులపై ఇరాన్ దాడులను మరింత తీవ్రం చేసింది. ఈ నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని 'షా'గ్యాస్ క్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్‌తో దాడి జరిపింది. ఈ ఘటనతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి.పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే ఆ ప్రాంతంలోని కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. గ్యాస్ క్షేత్రంపై జరిగిన ఈ డ్రోన్ దాడి కారణంగా పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మంటలతో పాటు దట్టమైన పొగ చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యాపించిందని తెలిపింది. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూబృందాలు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. ఈఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు.
వివరాలు
చమురు ట్యాంకర్‌పై దాడి
అలాగే గ్యాస్ క్షేత్రానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసే వరకు అక్కడి కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా,యూఏఈ తూర్పు తీరానికి సమీపంలో ఉన్న ఒక చమురు ట్యాంకర్‌పై కూడా క్షిపణి దాడి జరిగినట్లు సమాచారం. ఈ దాడి మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ వెల్లడించింది. ఫుజైరా సమీపంలోని ఒమన్ గల్ఫ్‌లో ఆ నౌక ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిపింది. ఈ దాడి కారణంగా ట్యాంకర్‌కు స్వల్ప నష్టం జరిగినప్పటికీ,ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ క్షిపణి దాడి వెనుక ఇరాన్ పాత్ర ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించామని,ఈ మార్గంలో ప్రయాణించే నౌకలు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు సూచించారు.