Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిలో కొత్త అనుమతి విధానం.. నౌకలకు ఇరాన్ కఠిన నిబంధనలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ తన నియంత్రణను మరింత కట్టుదిట్టం చేసింది. ఈ మార్గంలో ప్రయాణించే నౌకలకు ఇకపై ప్రత్యేక అనుమతి తప్పనిసరి చేస్తూ 'పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ' (పీజీఎస్‌ఏ) అనే కొత్త సంస్థను ఏర్పాటు చేసింది. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20శాతం ఈ మార్గం ద్వారానే సాగుతుండటంతో ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపిన వివరాల ప్రకారం,హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే ప్రతి నౌక ముందుగా ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం నౌక యజమానులు,బీమా వివరాలు, సిబ్బంది సమాచారం,సరుకు వివరాలు,ప్రయాణ మార్గం,నౌక గత చరిత్ర వంటి 40కిపైగా అంశాలతో కూడిన సమాచారం సమర్పించాలి.
వివరాలు
అనుమతి కోసం కోట్ల రూపాయలు చెల్లించిన కొన్ని నౌకలు
ఈ వివరాలను పరిశీలించిన తర్వాతే ఇరాన్ తదుపరి సూచనలు ఇస్తుందని తెలిపింది. అయితే ఈ అనుమతులకు భారీ మొత్తంలో రుసుములు వసూలు చేస్తున్నట్టు అంతర్జాతీయ నౌకాశ్రయ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కొన్ని నౌకలు అనుమతి కోసం కోట్ల రూపాయలు చెల్లించినట్టు నివేదికలు వెల్లడించాయి. హోర్ముజ్ మార్గాన్ని ఆర్థిక, భద్రతా పరంగా ఉపయోగించుకోవడమే ఇరాన్ లక్ష్యంగా కనిపిస్తోంది. అమెరికా ఆంక్షలకు మద్దతు ఇచ్చే దేశాలకు అనుమతుల విషయంలో ఇబ్బందులు తలెత్తవచ్చని ఇరాన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. అమెరికా లేదా ఇజ్రాయెల్‌కు అనుబంధంగా ఉన్న నౌకలపై ప్రత్యేక నిఘా ఉంటుందని కూడా సంకేతాలు ఇచ్చారు. మరోవైపు భారత్, పాకిస్థాన్ వంటి దేశాలు ఇరాన్‌తో చర్చలు జరిపి తమ నౌకల రాకపోకలకు సౌకర్యాలు పొందినట్టు సమాచారం.
వివరాలు
ప్రపంచ ఇంధన సరఫరాలో ఈ మార్గానికి అత్యంత ప్రాధాన్యం
హోర్ముజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్‌ను అరేబియా సముద్రంతో కలుపుతుంది. ప్రపంచ ఇంధన సరఫరాలో ఈ మార్గానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఇటీవల యుద్ధ పరిస్థితుల తర్వాత ఇరాన్ ఈ మార్గంలో నౌకల రాకపోకలను కట్టడి చేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. ఇదే సమయంలో ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా కూడా పరిమితులు కొనసాగిస్తోంది.
వివరాలు
కొత్త నియంత్రణ ప్రాంతాలను ప్రకటించిన ఇరాన్
ఇక సముద్ర జలాలపై తమ నియంత్రణను విస్తరించేందుకు ఇరాన్ కొత్త నియంత్రణ ప్రాంతాలను కూడా ప్రకటించింది. ఒమాన్ గల్ఫ్ నుంచి యూఏఈ సమీప జలాల వరకు ఈ నియంత్రణ విస్తరించే అవకాశం ఉందని సమాచారం. దీనిపై గల్ఫ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ, హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ తీసుకొచ్చిన ఈ కొత్త అనుమతి విధానం భవిష్యత్తులో అంతర్జాతీయ నౌకాయాన వ్యవస్థను పూర్తిగా మార్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.