Iran: భారత నౌకలపై కాల్పులు ..దర్యాప్తు ప్రారంభించిన ఇరాన్
ఈ వార్తాకథనం ఏంటి
హర్మూజ్ జలసంధిలో శనివారం రెండు భారత నౌకలపై జరిగిన కాల్పుల ఘటనపై ఇరాన్ స్పందించింది. ఈ దాడులు తమ బలగాలే చేశాయా అనే అంశంపై దర్యాప్తు ప్రారంభించినట్లు ఆ దేశ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘేయి వెల్లడించారు. భారత నౌకలను లక్ష్యంగా చేసిందేమిటి మా దళాలేనా అనే విషయాన్ని సంబంధిత సంస్థలు విచారిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. శనివారం జరిగిన ఈ ఘటనలో ఐఆర్‌జీసీ (IRGC) అనుమతి తీసుకుని హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న రెండు భారత నౌకలపై కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఆ నౌకలు వెంటనే మార్గం మళ్లించి పర్షియన్ గల్ఫ్ వైపు తిరిగి వెళ్లిపోయాయి.
వివరాలు
20 లక్షల బ్యారెళ్ల చమురు ఉన్నట్లు సమాచారం
ఈ నౌకల్లో ఒకదానిలో సుమారు 20 లక్షల బ్యారెళ్ల చమురు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. భారత్‌లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీకి సమన్లు జారీ చేసి వివరణ కోరింది. ఇరాన్ జలసంధిని తెరిచినట్లు ప్రకటించిన తర్వాతే వాణిజ్య నౌకలు ప్రయాణం ప్రారంభించాయని భారత్ గుర్తు చేసింది. ఇక అమెరికాతో సంబంధాల విషయానికి వస్తే, రెండో విడత చర్చలపై తమకు ఎలాంటి ప్రణాళిక లేదని ఇస్మాయిల్ బాఘేయి స్పష్టం చేశారు. చర్చల విషయంలో అమెరికా సీరియస్‌గా వ్యవహరించడం లేదని, కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలు, దుందుడుకు చర్యలకే ప్రాధాన్యం ఇస్తోందని ఆయన విమర్శించారు.