Ayatollah Ali Khamenei: జూన్ 21న ఖమేనీ అంతిమయాత్ర.. రెండు కోట్ల మంది హాజరయ్యే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌కు ఆధ్యాత్మిక, రాజకీయ నేతగా ఎన్నో దశాబ్దాల పాటు సేవలందించిన అయతొల్లా అలీ ఖమేనీకి ఈ నెల 21న అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన దాడిలో ఆయన మరణించినట్లు ప్రకటించినప్పటికీ, అంత్యక్రియలపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఖమేనీ చివరి కోరిక మేరకు ఆయన భౌతిక కాయాన్ని ఇరాన్‌లోని పవిత్ర నగరమైన మష్షాద్‌లో ఖననం చేసే అవకాశాలు ఉన్నాయని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ) తెలిపింది. షియా ముస్లింలకు అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావించే ఇమామ్ అలీ రెజా సమాధి సమీపంలోనే ఖమేనీని సమాధి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
వివరాలు
టెహ్రాన్‌లో సుమారు 24 గంటల పాటు ప్రధాన అంత్యక్రియల కార్యక్రమాలు
అంత్యక్రియల సందర్భంగా భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశముందని ఇరాన్ అధికార మీడియా పేర్కొంది. దాదాపు రెండు కోట్ల మంది ఖమేనీ అంతిమయాత్రలో పాల్గొనవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో అంతటి భారీ కార్యక్రమాన్ని నిర్వహించడం సవాలుగా మారడంతో ఇప్పటి వరకు అంత్యక్రియలను వాయిదా వేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. టెహ్రాన్‌లో సుమారు 24 గంటల పాటు ప్రధాన అంత్యక్రియల కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం ఖమేనీ అంతిమయాత్ర టెహ్రాన్ నుంచి ప్రారంభమై, కోమ్ నగరం మీదుగా మష్షాద్ వరకు కొనసాగనుంది. ఈ మొత్తం కార్యక్రమాన్ని ఐఆర్‌జీసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
గిన్నిస్ రికార్డు
ఇరానీయుల పవిత్ర మాసంగా భావించే ఖొర్దాద్ ఈ నెల 21తో ముగియనుండటంతో అదే రోజున అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ సందర్భంగా 1989 జూన్‌లో జరిగిన ఇస్లామిక్ విప్లవ నాయకుడు ఆయతుల్లా రూహుల్లా ఖొమైనీ అంత్యక్రియలను కూడా గుర్తు చేస్తున్నారు. అప్పట్లో దాదాపు కోటి మంది ఆయన అంతిమయాత్రలో పాల్గొనగా, అది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనసమూహం హాజరైన అంత్యక్రియలలో ఒకటిగా నిలిచి గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది.