Iran: అమెరికాతో మరోసారి యుద్ధం జరిగే అవకాశం.. ఇరాన్ సైనికాధికారి హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ ఇరాన్-యూఎస్ మధ్య ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. అమెరికాతో మరోసారి యుద్ధం జరిగే అవకాశం ఉందని ఇరాన్ సైనికాధికారి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చల విషయంలో ఇరాన్, అమెరికా మధ్య అనిశ్చితి నెలకొంది. ఒప్పందం కోసం ఇరాన్ పంపిన తాజా ప్రతిపాదనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇరాన్ సైనిక ప్రధాన కార్యాలయ డిప్యూటీ అధికారి మహమ్మద్ జాఫర్ అసదీ మాట్లాడుతూ.. అమెరికా ఏ ఒప్పందాలకూ, హామీలకూ కట్టుబడి ఉండడం లేదని ఆరోపించారు. చమురు ధరల పతనాన్ని అడ్డుకోవడం, తాము సృష్టించిన పరిస్థితుల నుంచి బయటపడేందుకు అమెరికా అధికారుల ప్రకటనలు ఉన్నాయని విమర్శించారు.
వివరాలు
మరోసారి దాడులకు దిగే అవకాశం
ఈ క్రమంలో యూఎస్-ఇజ్రాయెల్ కలిసి తమ దేశంపై మరోసారి దాడులకు దిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి దాడులనైనా తిప్పికొట్టేందుకు తమ సాయుధ దళాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిలో ప్రయాణించే నౌకల నుంచి ఇరాన్ టోల్ వసూలు చేస్తోందన్న వార్తలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. ఈ అంశంపై అమెరికా ట్రెజరీ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ విధించే టోల్ చెల్లించే షిప్పింగ్ సంస్థలు తమ ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. టోల్ చెల్లింపులు సహా ఇరాన్ సైన్యానికి మద్దతు ఇచ్చే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని అమెరికా హెచ్చరించింది.