LOADING...
Hormuz: హర్మూజ్ జలసంధిలో నౌకలపై టోల్: ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసిన ఇరాన్ నిర్ణయం
హర్మూజ్ జలసంధిలో నౌకలపై టోల్: ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసిన ఇరాన్ నిర్ణయం

Hormuz: హర్మూజ్ జలసంధిలో నౌకలపై టోల్: ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసిన ఇరాన్ నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 31, 2026
10:21 am

ఈ వార్తాకథనం ఏంటి

చమురు రవాణాలో ప్రపంచానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జలమార్గం గుండా వెళ్లే నౌకలపై టోల్ వసూలు చేయడానికి ఇరాన్ పార్లమెంట్ సెక్యూరిటీ కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో ఇకపై అధికారికంగా హర్మూజ్ మార్గంలో ప్రయాణించే నౌకలు టోల్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంతో హర్మూజ్ మేనేజ్‌మెంట్ ప్లాన్ అమలుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రతి చమురు ట్యాంకర్‌పై గరిష్ఠంగా సుమారు రూ.18.90 కోట్లు వరకు టోల్ వసూలు చేయనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది.

వివరాలు 

అమెరికా, ఇజ్రాయెల్ దేశాల నౌకల రాకపోకలపై పరిమితులు

హర్మూజ్ జలసంధిపై తన సార్వభౌమాధికారాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని ఇరాన్ పేర్కొంది. ఈ ప్రణాళికలో భాగంగా జలమార్గ భద్రతను పెంచడం,సముద్రయానానికి రక్షణ కల్పించడం,ఆర్థిక నిబంధనలు అమలు చేయడం వంటి అంశాలు ఉన్నాయి. అంతేకాకుండా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు చెందిన నౌకల రాకపోకలపై పరిమితులు విధించే అంశం కూడా ఇందులో భాగమైంది. మార్చి 13 నుంచే ఈ టోల్ విధానం అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) రూపొందించిన నిబంధనలను అనుసరించి ఇప్పటివరకు 26 నౌకలు హర్మూజ్ గుండా ప్రయాణించాయి. ఈ నౌకలు ముందుగా అవసరమైన పత్రాలు సమర్పించి, ప్రత్యేక క్లియరెన్స్ కోడ్‌లు పొందిన తర్వాతే ప్రయాణానికి అనుమతి పొందినట్లు వెల్లడించారు.

వివరాలు 

అమెరికా తీవ్ర అభ్యంతరం

హర్మూజ్ జలసంధిపై ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఈ మార్గంపై ఇరాన్ నియంత్రణను ప్రపంచ దేశాలు అంగీకరించబోవని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశాలు కేవలం ఇతర దేశాల భూభాగాలే కాకుండా అంతర్జాతీయ జలమార్గాలపై కూడా హక్కులు ప్రకటించుకునే పరిస్థితి వస్తోందని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇక జీ7 దేశాలు కూడా ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాయి. నౌకాయాన స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యలు తక్షణమే ఆపాలని, అంతర్జాతీయ జలమార్గాల్లో స్వేచ్ఛాయుత రవాణా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అవి సూచించాయి.

Advertisement