BRICS: భారత్‌కు రానున్న ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్!
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. సెప్టెంబర్‌లో దిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు ఆయన హాజరుకానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ.. భారత్ అధ్యక్షతన జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సులో ఇరాన్ అధ్యక్షుడు పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2024 అక్టోబర్‌లో రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. గతేడాది బ్రెజిల్ వేదికగా బ్రిక్స్ సదస్సు జరగగా.. అనంతరం ఈ ఏడాది అధ్యక్ష బాధ్యతలను భారత్ స్వీకరించింది.
వివరాలు
బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం..
2024లో ఇరాన్‌తో పాటు ఈజిప్టు, ఇథియోపియా, యూఏఈ దేశాలు బ్రిక్స్ కూటమిలో చేరాయి.
గతేడాది ఇండోనేసియా కూడా కూటమిలో చేరింది. దీంతో ప్రస్తుతం బ్రిక్స్‌లో పూర్తిస్థాయి సభ్యదేశాల సంఖ్య 11కు చేరింది.
ఇదిలా ఉండగా.. రెండు నెలల క్రితం దిల్లీలో జరిగిన బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే.