US-Iran War: ట్రంప్ శాంతి ప్రతిపాదనకు ఇరాన్ తిరస్కారం.. నివేదికలో కీలక వివరాలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని ఇరాన్ తిరస్కరించినట్లు ది న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో వెల్లడించింది. ఇరాక్ ప్రధాని అలీ అల్-జైదీ ఇటీవల టెహ్రాన్ పర్యటన సందర్భంగా ఈ ప్రతిపాదనను ఇరాన్ నాయకత్వానికి అందించినట్లు నివేదిక పేర్కొంది. దాదాపు మూడు వారాలుగా అమెరికా ఇరాన్ సైనిక స్థావరాలు, కీలక మౌలిక సదుపాయాలపై దాడులు కొనసాగిస్తున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు తెలిపింది. నివేదిక ప్రకారం, ప్రస్తుతం చర్చల్లో ఉన్న ఏకైక ప్రతిపాదన ఇదేనని ఇరాన్, ఇరాక్ అధికారులను ఉటంకిస్తూ పేర్కొంది. అయితే ఒప్పందంలోని పూర్తి వివరాలను వెల్లడించలేదు. ముఖ్యంగా హర్ముజ్ జలసంధిపై నియంత్రణ అంశానికి పరిష్కారం చూపకుండా కేవలం తాత్కాలిక కాల్పుల విరమణకు ఇరాన్ సిద్ధంగా లేదని సమాచారం.
వివరాలు
మధ్యవర్తుల అవసరం లేదన్న ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ
ఇరాక్ ప్రధాని అలీ అల్-జైదీ ముందుగా అమెరికా వెళ్లి వైట్ హౌస్‌లో అధ్యక్షుడు ట్రంప్‌ను కలిశారు.
అనంతరం టెహ్రాన్ చేరుకుని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతో పాటు పలువురు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి అరాఘ్చీ స్పందిస్తూ.. మధ్యవర్తుల అవసరం లేదని స్పష్టం చేశారు.
అయితే వాషింగ్టన్‌లోని తన అభిప్రాయాలు, పరిస్థితులను అలీ అల్-జైదీ తమకు వివరించిన విషయాన్ని ధృవీకరించారు.
"సందేశాలు చేరవేయడం సమస్య కాదు. అసలు సమస్య అమెరికా ఆలోచనా విధానం. అది హేతుబద్ధంగా లేదు. అత్యాశతో, ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తోంది" అని ఆయన విమర్శించారు.
వివరాలు
అమెరికా సైనిక స్థావరాలు,మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు
ఇరాక్‌తో తమకు ఆర్థిక, రాజకీయ, భద్రతా రంగాల్లో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని,ప్రాంతీయ ఉద్రిక్తతల సమయంలో ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందన్నారు.
ఇదిలా ఉండగా, అమెరికా దాదాపు రెండు వారాలుగా ఇరాన్ సైనిక స్థావరాలు,మౌలిక సదుపాయాలపై దాడులు కొనసాగిస్తోంది.
దీనికి ప్రతిగా ఇరాన్ కూడా మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక లక్ష్యాలపై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు నిర్వహించింది.
మరోవైపు, ట్రంప్ టెహ్రాన్‌తో పాటు ఇతర కీలక ప్రాంతాలపై దాడులు చేస్తామని చేసిన హెచ్చరికలను అమలు చేస్తే యుద్ధం మరింత విస్తరించే అవకాశం ఉందని ఇరాన్ అధికారులు భావిస్తున్నట్లు నివేదిక తెలిపింది.
అవసరమైతే ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌ను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే అవకాశం ఉందని వారు పేర్కొన్నట్లు నివేదిక వెల్లడించింది.
వివరాలు
ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న పలు నౌకలపై హౌతీ దాడులు
అలాగే ఎర్ర సముద్రంలోని కీలక సముద్ర మార్గమైన బాబ్ అల్-మండబ్ జలసంధిని మూసివేయాలని యెమెన్‌లోని హౌతీ మిత్ర బలగాలను కోరే అవకాశమూ ఉందని సమాచారం.
ఇప్పటికే హౌతీలు ఆ జలమార్గాన్ని మూసివేస్తామని హెచ్చరిస్తూ, అక్కడ ప్రయాణిస్తున్న పలు నౌకలపై దాడులు చేశారు.
ఇరాన్‌లో మాత్రం ప్రభుత్వానికి ప్రజల మద్దతు కొనసాగుతోందని, టెహ్రాన్‌లోని అజాదీ స్క్వేర్‌లో ప్రభుత్వ అనుకూల ర్యాలీలు నిర్వహిస్తున్నారని నివేదిక తెలిపింది.
ఇటీవల నిర్వహించిన సైనిక విన్యాసాల్లో దేశీయంగా తయారు చేసిన బాలిస్టిక్ క్షిపణులను ప్రదర్శించడం ద్వారా, అమెరికా దాడులతో ఇరాన్ సైనిక సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిన్నదన్న ట్రంప్ వ్యాఖ్యలకు భిన్నమైన సంకేతాలు ఇచ్చినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.