LOADING...
Abbas Araghchi: యురేనియం శుద్ధి మా హక్కు.. ఎవరూ శాసించలేరు: ఇరాన్ హెచ్చరిక
యురేనియం శుద్ధి మా హక్కు.. ఎవరూ శాసించలేరు: ఇరాన్ హెచ్చరిక

Abbas Araghchi: యురేనియం శుద్ధి మా హక్కు.. ఎవరూ శాసించలేరు: ఇరాన్ హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 09, 2026
09:43 am

ఈ వార్తాకథనం ఏంటి

అణు కార్యక్రమంపై వెనక్కి తగ్గే ప్రశ్నే లేదని ఇరాన్ మరోసారి కుండబద్దలు కొట్టింది. యురేనియం శుద్ధి చేసుకునే హక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమని, తమ విధానాలను నిర్దేశించే అధికారం ఏ దేశానికీ లేదని స్పష్టంచేసింది. అమెరికాతో చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ఒత్తిడి తెచ్చి లొంగదీసుకునే ప్రయత్నాలు చేస్తే మాత్రం తాము సహించబోమని హెచ్చరించింది. టెహ్రాన్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో అబ్బాస్ అరఘ్చీ ఈ వ్యాఖ్యలు చేశారు. "మాపై యుద్ధం రుద్దినా సరే, యురేనియం శుద్ధిని ఎందుకు వదులుకోవాలి? మా ప్రవర్తనను శాసించే హక్కు ఎవరికీ లేదు" అంటూ ఆయన తీవ్ర స్వరంతో స్పందించారు. అమెరికాతో అణు ఒప్పందంపై ఒమన్లో ఇటీవల పరోక్ష చర్చలు మళ్లీ ప్రారంభమైన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

వివరాలు 

ప్రాంతంలో అమెరికా సైనిక మోహరింపులకు భయపడబోమని వ్యాఖ్య

అమెరికా ఉద్దేశాలపై తమకు గట్టి అనుమానాలున్నాయని అరఘ్చీ వెల్లడించారు. తమను భయపెట్టేందుకే ఈ ప్రాంతంలో యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమానవాహక నౌకను మోహరించారని పేర్కొన్నారు. అయితే ఇలాంటి సైనిక చర్యలకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. శాంతియుత అవసరాల కోసం యురేనియం శుద్ధి చేసుకునే తమ హక్కును అంగీకరిస్తేనే అణు ఒప్పందం సాధ్యమవుతుందని తెలిపారు. క్షిపణి కార్యక్రమం వంటి ఇతర అంశాలపై చర్చలకు తావు లేదని ఆయన తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య ఒమన్ చర్చల ఫలితాలను ఇరు పక్షాలు సమీక్షిస్తున్నాయి. త్వరలో మరో విడత చర్చలు జరిగే అవకాశం ఉందని అరఘ్చీ అంచనా వేశారు. ఇదే అంశంపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు, ఇజ్రాయెల్ ప్రధాని ఫిబ్రవరి 11న భేటీ కానున్నట్లు సమాచారం.

Advertisement