LOADING...
Iran: 87 రోజుల తర్వాత ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ.. ఇరాన్ కీలక నిర్ణయం
87 రోజుల తర్వాత ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ.. ఇరాన్ కీలక నిర్ణయం

Iran: 87 రోజుల తర్వాత ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ.. ఇరాన్ కీలక నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
May 26, 2026
07:57 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 87 రోజుల పాటు కొనసాగిన కఠినమైన ఇంటర్నెట్ నిలిపివేతను ఎత్తివేస్తూ అంతర్జాతీయ అంతర్జాల సేవలను మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ అధికారిక ఆదేశాలు జారీ చేశారు. గత కొన్నినెలలుగా ఇరాన్‌లో తీవ్ర అంతర్గత ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా దాడులకు ముందే దేశవ్యాప్తంగా అసంతృప్తి పెరిగింది. ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. దీంతో జనవరి 8న తొలిసారిగా ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు అమలు చేశారు. మధ్యలో కొంత సడలింపు ఇచ్చినా,పూర్తిస్థాయిలో సేవలు మాత్రం అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు దాదాపు నాలుగునెలల తర్వాత సేవలను పూర్తిగా పునరుద్ధరించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

వివరాలు 

జనవరి 8న మొదటిసారిగా ఇంటర్నెట్ ఆంక్షలు

ఇరాన్ సైబర్ వ్యవహారాల ఉన్నత స్థాయి సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణకు అనుకూలంగా 9 ఓట్లు, వ్యతిరేకంగా 3 ఓట్లు నమోదయ్యాయి. అనంతరం ఈ నిర్ణయాన్ని ఇరాన్ సమాచార ప్రసార శాఖ అధికారికంగా ప్రకటించింది. దేశంలోని ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు ఉద్ధృతం కావడంతో జనవరి 8న మొదటిసారిగా ఇంటర్నెట్ ఆంక్షలు విధించారు. ఆ తర్వాత జనవరి 23న కొంత మేర సడలింపు ఇచ్చినా, ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ఉద్రిక్తతల నేపథ్యంలో మళ్లీ కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చారు.

వివరాలు 

అత్యంత దీర్ఘకాలం కొనసాగిన తీవ్రమైన ఇంటర్నెట్ నిలిపివేత

అంతర్జాల పర్యవేక్షణ సంస్థ 'నెట్‌బ్లాక్స్' తెలిపిన వివరాల ప్రకారం.. సాధారణంగా 90 నుంచి 100 శాతం మధ్య ఉండే ఇంటర్నెట్ వినియోగం,ఈ ఆంక్షల సమయంలో కేవలం 1 నుంచి 2 శాతానికి పడిపోయింది. ఆధునిక చరిత్రలోనే ఇది అత్యంత దీర్ఘకాలం కొనసాగిన తీవ్రమైన ఇంటర్నెట్ నిలిపివేతగా ఆ సంస్థ పేర్కొంది. సేవలు నిలిచిపోవడంతో ప్రజలు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్వతంత్ర సమాచారం తెలుసుకునే అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి.

Advertisement

వివరాలు 

ఉద్యోగాలు కోల్పోయిన 10 లక్షల మంది

యుద్ధ పరిస్థితులు, నిరసనలు, ఇంటర్నెట్ ఆంక్షల ప్రభావంతో దేశంలో ఉపాధి రంగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం. దాదాపు 10 లక్షల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయినట్లు 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' వెల్లడించింది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల ప్రకటనలపై ఆధారపడిన చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి దారులు, సాంకేతిక రంగ సంస్థలు, సాఫ్ట్‌వేర్ రూపకర్తల పనులు పూర్తిగా నిలిచిపోయినట్లు పేర్కొంది.

Advertisement