Iran: ట్రంప్ పదవీకాలం ముగిసే వరకు అమెరికాతో చర్చలు లేవన్న ఇరాన్
ఈ వార్తాకథనం ఏంటి
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవీకాలం పూర్తయ్యే వరకు అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాతో చర్చలకు వెళ్లే అవకాశం లేదని ఇరాన్ విదేశాంగశాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయి స్పష్టం చేశారు. అమెరికా తమ షరతులను అంగీకరించే వరకు హర్మూజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని బఘేయి తెలిపారు. రేవుల దిగ్బంధనాన్నిఎత్తివేయాలని ఇరాన్ కోరింది.అలాగే యుద్ధం కారణంగా తమ దేశానికి జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. ఇరాన్‌పై విధించిన ఆర్థిక ఆంక్షలను తొలగించాలని,స్తంభింపజేసిన తమ ఆస్తులను తిరిగి విడుదల చేయాలని కూడా బఘేయి కోరారు. ఈ డిమాండ్లను అమెరికా అంగీకరించిన తర్వాతే హర్మూజ్ జలసంధిని తెరవడంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
'మీరే పరిహారం చెల్లించాలి'.. ట్రంప్
గత ఐదు నెలల యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని ఇరాన్ కోరుతోందని ట్రంప్ తెలిపారు.
ఆ డిమాండ్ మంచి ఆలోచనేనని వ్యాఖ్యానించారు. అయితే ఇరాన్ కూడా చాలా ఏళ్లుగా చేసిన అరాచకాలకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఇరాన్ దశాబ్దాలుగా అరాచకాలకు పాల్పడుతోందని ట్రంప్ ఆరోపించారు. ఆందోళనల సమయంలో వేలాది మందిని హతమార్చిందని పేర్కొన్నారు.
గత ఐదు నెలల్లో చంపిన 52,000 మందికి కూడా ఇరాన్ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
దీంతో యుద్ధ నష్టానికి పరిహారం, ఆర్థిక ఆంక్షల ఎత్తివేత, స్తంభింపజేసిన ఆస్తుల విడుదల, హర్మూజ్ జలసంధి పునఃప్రారంభం వంటి అంశాలపై ఇరాన్-అమెరికా మధ్య విభేదాలు మరింత తీవ్రంగా మారాయి.