Abbas Araghchi: ఫ్యామిలీతో అదే చివరి కాల్ అనిపించింది: ఇరాన్ మంత్రి అరాఘ్చి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో శాంతి చర్చలు సాగుతున్న సమయంలో తమ ప్రతినిధులు తీవ్ర ప్రాణభయంతో పనిచేయాల్సి వచ్చిందని వెల్లడించారు. ఏ క్షణంలోనైనా సమావేశాలపై బాంబు దాడులు జరిగే అవకాశం ఉందనే ఆందోళన ఎప్పుడూ వెంటాడేదని చెప్పారు. ఇరాన్ ప్రభుత్వ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అరాఘ్చి మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్‌తో జరిగిన చర్చల అనుభవాలను పంచుకున్నారు. చర్చల సమయంలో భద్రతపై తీవ్ర అనిశ్చితి నెలకొనేదని, కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన ప్రతిసారీ అది చివరి సంభాషణ కావచ్చేమోనన్న భావన కలిగేదని పేర్కొన్నారు.
వివరాలు
అమెరికా, ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఒత్తిళ్లకు ఇరాన్ ఎప్పుడూ తలొగ్గలేదు
ఎప్పుడు బాంబు దాడి జరుగుతుందో తెలియని పరిస్థితుల్లోనే చర్చలు కొనసాగించాల్సి వచ్చిందని తెలిపారు.
అమెరికా, ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఒత్తిళ్లకు ఇరాన్ ఎప్పుడూ తలొగ్గలేదని అరాఘ్చి స్పష్టం చేశారు.
అణు కార్యక్రమంలో యురేనియం ఎన్‌రిచ్‌మెంట్‌ను పూర్తిగా నిలిపివేయాలన్న డిమాండ్‌ను తమ దేశం అంగీకరించలేదని చెప్పారు.
దేశ హక్కులు, సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశాల్లో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
సమస్యల పరిష్కారానికి చర్చలే మార్గమని, బెదిరింపులు లేదా ప్రలోభాలతో ఇరాన్ వైఖరిని మార్చడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు.
వివరాలు
ఇరాన్‌ను ఇతర దేశాలతో పోల్చడం సరైంది కాదు
చర్చల ద్వారా తమ లక్ష్యాలు నెరవేరవని భావించిన తర్వాతే అమెరికా సైనిక చర్యల వైపు మళ్లిందని అరాఘ్చి ఆరోపించారు.
సైనిక ఒత్తిడితో ఇరాన్‌ను లొంగదీయాలన్న ఆలోచన వాస్తవానికి దూరమని అన్నారు.
ఇరాన్‌ను ఇతర దేశాలతో పోల్చడం సరైంది కాదని, ఒక నాయకుడు తప్పుకున్నా మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితి తమ దేశంలో లేదని పేర్కొన్నారు.
అధికార వ్యవస్థ అనేక స్థాయిల్లో బలంగా పనిచేస్తుందని వివరించారు. మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణలు మరింత ఉద్ధృతమవుతున్నాయి.
అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇరాన్‌పై వరుసగా తొమ్మిదో రోజు వైమానిక దాడులు కొనసాగుతున్నట్లు ప్రకటించింది.
హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులకు ఉపయోగిస్తున్న ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరచడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని అమెరికా వెల్లడించింది.
వివరాలు
అమెరికా ప్రత్యేక ఆపరేషన్స్ కేంద్రంపై దాడి: IRGC
అదే సమయంలో ఇరాన్ మీడియా కథనాల ప్రకారం తబ్రిజ్, చాబహార్, కొనారక్, బందర్ మహ్‌షహర్ ప్రాంతాల్లో పేలుళ్లు చోటుచేసుకున్నట్లు సమాచారం వెలువడింది.
మరోవైపు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సిరియాలోని అల్-తన్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా ప్రత్యేక ఆపరేషన్స్ కేంద్రంపై దాడి నిర్వహించినట్లు ప్రకటించింది.
ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.