Mojtaba Khamenei: రహస్య స్థావరంలో మొజ్తాబా ఖమేనీ.. దూతల ద్వారానే సందేశాలు!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నప్పటికీ ఇంకా స్పష్టమైన నిర్ణయానికి రాలేదని సమాచారం. ఇందుకు ప్రధాన కారణం ఇరాన్ అత్యున్నత నాయకుడు మొజ్తాబా ఖమేనీ అందుబాటులో లేకపోవడమేనని అమెరికా నిఘా వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఓ రహస్య ప్రదేశంలో ఉంటున్నట్లు సమాచారం. ప్రభుత్వ అధికారులు, కీలక నేతలతో కూడా ఆయన నేరుగా మాట్లాడడం లేదని తెలుస్తోంది. దూతల ద్వారా మాత్రమే సందేశాలు పంపిస్తున్నట్లు వెల్లడైంది. అమెరికా-ఇరాన్ ఒప్పందానికి సంబంధించిన ప్రాథమిక రూపరేఖలను మొజ్తాబా ఖమేనీ పరిశీలించినట్లు సమాచారం అందిందని అమెరికా నిఘా సంస్థలు పేర్కొన్నాయి. అయితే, ఇప్పటివరకు ఆయన నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదని వెల్లడించాయి.
వివరాలు
భూగర్భ బంకర్లలోనే టెహ్రాన్‌కు చెందిన పలువురు సీనియర్ నాయకులు
ఇరాన్‌కు చెందిన ఉన్నతాధికారులు కూడా ఖమేనీని నేరుగా సంప్రదించలేకపోతున్నారని, ఇదే చర్చలు ఆలస్యం కావడానికి కారణమవుతోందని పేర్కొన్నాయి. మరోవైపు, టెహ్రాన్‌కు చెందిన పలువురు సీనియర్ నాయకులు కూడా గత కొన్ని వారాలుగా భూగర్భ బంకర్లలోనే ఉంటున్నట్లు సమాచారం. వీరంతా పరస్పరం నేరుగా సమావేశాలు నిర్వహించడం లేదని తెలుస్తోంది. భద్రతా కారణాల వల్ల అత్యంత గోప్యంగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రారంభమైన తొలి రోజే అప్పటి సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీని కొత్త సుప్రీం నేతగా ఎన్నుకున్నారు. అయితే, ఇజ్రాయెల్ దాడుల్లో మొజ్తాబా కూడా తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వచ్చాయి.
వివరాలు
ఇజ్రాయెల్ వరుస హెచ్చరికలు జారీ
ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలుమార్లు ప్రచారం జరిగినప్పటికీ వాటిని ఇరాన్ ప్రభుత్వం ఖండించింది. మొజ్తాబా ఆరోగ్యంగానే ఉన్నారని ప్రకటించింది. అయితే, ఇప్పటివరకు మొజ్తాబా ఖమేనీ బహిరంగంగా ఎక్కడా కనిపించకపోవడం, ప్రజలను ఉద్దేశించి మాట్లాడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదే సమయంలో ఖమేనీ హోదాలో ఎవరు ఉన్నా తమ లక్ష్యంగానే ఉంటారని ఇజ్రాయెల్ వరుస హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ పరిణామాల మధ్య మొజ్తాబా రహస్య ప్రాంతంలో తలదాచుకున్నారన్న వార్తలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.