Loading...
Strait of Hormuz: హర్ముజ్ జలసంధిలో రాకపోకలకు టోల్.. ఇరాన్ పార్లమెంట్ కమిటీ ఆమోదం
హర్ముజ్ జలసంధిలో రాకపోకలకు టోల్.. ఇరాన్ పార్లమెంట్ కమిటీ ఆమోదం

Strait of Hormuz: హర్ముజ్ జలసంధిలో రాకపోకలకు టోల్.. ఇరాన్ పార్లమెంట్ కమిటీ ఆమోదం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 24, 2026
03:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ హర్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యూహాత్మక జలమార్గం గుండా ప్రయాణించే నౌకల నుంచి టోల్ వసూలు చేసే ప్రతిపాదనకు ఇరాన్ పార్లమెంట్‌లోని జాతీయ భద్రతా కమిటీ ఆమోదం తెలిపినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే ఈ నిర్ణయం ఇంకా అమల్లోకి రాలేదు.

వివరాలు 

హర్ముజ్‌లో నౌకలకు కొత్త నిబంధనలు

హర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలకు సంబంధించి కొత్త నిబంధనలను ఈ ప్రతిపాదనలో పొందుపరిచారు.

ఇందులో భాగంగా నౌకల నుంచి రవాణా రుసుమును ఇరాన్ జాతీయ కరెన్సీ రియాల్‌లో వసూలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

అమెరికా, ఇజ్రాయెల్‌తో సంబంధాలున్న నౌకలు హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లకుండా నిషేధించే నిబంధన కూడా ఇందులో ఉన్నట్లు ఫార్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

ఈ వివరాలను కమిటీ సభ్యుడు మొజ్తబా జరీ వెల్లడించినట్లు పేర్కొంది.

వివరాలు 

ఆంక్షలు విధించిన దేశాలకూ ఆంక్షలు

ఇరాన్‌పై ఏకపక్ష ఆంక్షలు విధించిన దేశాలకు కూడా హోర్ముజ్ జలసంధిలో ప్రవేశం నిరాకరించే నిబంధనలు ప్రతిపాదనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఇది ప్రస్తుతం కేవలం ప్రతిపాదన దశలోనే ఉంది. ముందుగా దీనికి ఇరాన్ పార్లమెంట్‌లో పూర్తి స్థాయి ఆమోదం లభించాలి.

ఆ తర్వాత గార్డియన్ కౌన్సిల్ పరిశీలనకు వెళ్లాలి. చివరగా అధ్యక్షుడు సంతకం చేసిన తర్వాతే ఇది చట్టంగా మారుతుంది.

ADVERTISEMENT

వివరాలు 

హర్ముజ్‌పై ట్రంప్ మరోసారి వ్యాఖ్యలు

ఇరాన్ హోర్ముజ్ జలసంధిలో ప్రయాణించే నౌకల నుంచి రుసుము వసూలు చేయాలని యోచిస్తున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ జలమార్గంపై మరోసారి స్పందించారు.

తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్'లో హోర్ముజ్ జలసంధిని 'కొత్త అమెరికా భూభాగం'గా చూపించే ఓ మ్యాప్‌ను పోస్ట్ చేశారు.

అయితే ఆ చిత్రంపై ఆయన ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇదే మ్యాప్‌ను ట్రంప్ గతంలోనూ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఆగస్టు 18న కూడా ఆయన హోర్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా చూపించే మ్యాప్‌ను ప్రచురించారు. అంతకుముందు ఆగస్టు 15న తొలిసారిగా ఈ ప్రతిపాదనను ప్రస్తావించారు.

ADVERTISEMENT

వివరాలు 

'ఇరాన్‌ను ఓడించిన తర్వాత హర్ముజ్ అమెరికాదే':  ట్రంప్

న్యూయార్క్‌లో జరిగిన ఓ ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ తీవ్రంగా ఓడిపోతోందని, దాన్ని పూర్తిగా ఓడించిన తర్వాత హోర్ముజ్ జలసంధి అమెరికాకు చెందిన భూభాగమని త్వరలో ప్రకటిస్తానని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు అప్పట్లో అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.

హోర్ముజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత కీలకమైన సముద్ర రవాణా మార్గాల్లో ఒకటి.

యుద్ధం ప్రారంభమయ్యే ముందు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతయ్యే ముడి చమురు, ద్రవీకృత సహజ వాయువు (LNG)లో దాదాపు ఐదో వంతు ఈ జలసంధి మీదుగానే రవాణా అయ్యేది.

దీంతో ఇరాన్ ప్రతిపాదించిన కొత్త నిబంధనలు, ట్రంప్ తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన సరఫరాలపై ప్రభావం చూపే అంశాలుగా మారాయి.

ADVERTISEMENT