Iran-US: శాంతి చర్చల్లో విభేదాలు.. ఒప్పందం ఆలస్యమవుతుందన్న ఇరాన్
ఈ వార్తాకథనం ఏంటి
హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేయడంతో అమెరికా-ఇరాన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యంతో జరుగుతున్న శాంతి చర్చల్లో కొంత పురోగతి ఉన్నప్పటికీ, తుది ఒప్పందం ఇప్పట్లో కుదిరేలా లేదని, అది ఇంకా చాలా దూరంలో ఉందని పేర్కొన్నారు. చర్చల్లో అనేక విభేదాలు కొనసాగుతున్నాయని, పలు ప్రాథమిక అంశాలు ఇంకా పరిష్కారం కాలేదని తెలిపారు. వారాల తరబడి కొనసాగిన యుద్ధంలో ఇరాన్ క్షేత్రస్థాయిలో విజయాన్ని సాధించిందని ఆయన అన్నారు. తమ డిమాండ్లను అమెరికా అంగీకరించినందుకే తాత్కాలిక కాల్పుల విరమణకు ఒప్పుకున్నామని వెల్లడించారు. ఈ యుద్ధంలో అమెరికా తన లక్ష్యాలను సాధించలేకపోయిందని కూడా విమర్శించారు.
వివరాాలు
ఎప్పటికీ ఇరాన్ నియంత్రణలోనే ఉంటుంది
హర్మూజ్ జలసంధి ఇప్పటికీ, ఎప్పటికీ ఇరాన్ నియంత్రణలోనే ఉంటుందని స్పష్టం చేశారు. తమపై పలు డిమాండ్లను రుద్దేందుకు శత్రువులు ప్రయత్నించారని, అయితే వాటిని అంగీకరించకపోవడంతోనే చర్చలు ఆలస్యమవుతున్నాయని తెలిపారు. తదుపరి విడత చర్చలకు ఇప్పటికీ తేదీ ఖరారు కాలేదని పేర్కొన్నారు. అమెరికా తమతో సంప్రదింపులు కొనసాగిస్తున్నదని, చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో బఘేర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా ఉండగా శనివారం వైట్‌హౌస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, హర్మూజ్ అంశంలో ఇరాన్ అతిగా వ్యవహరిస్తోందని విమర్శించారు. జలసంధిని తిరిగి తెరిపించేందుకు చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. అవసరమైతే కఠిన చర్యలకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.