Majid Khademi: ఇరాన్ ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ ఖదేమీ మృతి
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింతగా తీవ్రతరం అవుతున్నాయి. ఇరాన్‌కు మరో పెద్ద దెబ్బ తగిలింది. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన వైమానిక దాడిలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ఇంటెలిజెన్స్ విభాగ అధిపతి మేజర్ జనరల్ సయ్యద్ మజీద్ ఖదేమీ ప్రాణాలు కోల్పోయారు. సోమవారం తెల్లవారుజామున ఈ దాడి జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఈ ఘటనపై ఐఆర్‌జీసీ స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ దాడిని నేరపూరిత ఉగ్రచర్యగా అభివర్ణించిన సంస్థ, ఖదేమీ 'షహీద్'గా (అమరుడిగా) నిలిచారని పేర్కొంది. అయితే దాడి జరిగిన ప్రదేశాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇరాన్ భద్రతా వ్యవస్థలో కీలకమైన నిఘా విభాగానికి ఖదేమీ నాయకత్వం వహించడం గమనార్హం.
వివరాలు
తొలి దాడిలోనే ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ మృతి
ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటికే ఇరాన్ పలు కీలక ఉన్నతాధికారులను కోల్పోయింది. గత నెలలో ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ, ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్‌లను ఇజ్రాయెల్ దళాలు హతమార్చాయి. అంతకుముందు ఐఆర్‌జీసీ చీఫ్ మహమ్మద్ పక్‌పూర్, బసీజ్ ఫోర్స్ చీఫ్ ఘోలామ్‌రెజా సొలైమానీ వంటి ప్రముఖ నేతలు కూడా ఈ దాడుల్లో మృతి చెందారు. ఫిబ్రవరి 28న జరిగిన తొలి దాడిలోనే ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ మరణించారు. ప్రస్తుతం ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయనను కూడా లక్ష్యంగా చేసుకుంటామని అమెరికా, ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.