LOADING...
US-Iran: ప్రత్యక్ష భేటీకి నో.. మధ్యవర్తుల ద్వారానే చర్చలు : ఇరాన్
ప్రత్యక్ష భేటీకి నో.. మధ్యవర్తుల ద్వారానే చర్చలు : ఇరాన్

US-Iran: ప్రత్యక్ష భేటీకి నో.. మధ్యవర్తుల ద్వారానే చర్చలు : ఇరాన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 25, 2026
08:46 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా-ఇరాన్‌ మధ్య మరో విడత చర్చలు నేడు పాకిస్థాన్‌ వేదికగా జరగనున్నాయి. ఈ చర్చల కోసం ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఇప్పటికే ఇస్లామాబాద్‌కు చేరుకుంది. అయితే తొలి విడత చర్చలకు భిన్నంగా ఈసారి అమెరికా-ఇరాన్‌ ప్రతినిధుల మధ్య నేరుగా భేటీ ఉండదని టెహ్రాన్‌ స్పష్టం చేసింది. ఇరుదేశాల మధ్య సందేశాలను పాకిస్థాన్‌ అధికారులు మధ్యవర్తిత్వంగా బదిలీ చేస్తారని వెల్లడించింది. అరాగ్చీ బృందం పాకిస్థాన్‌ ఉన్నతాధికారులతో సమావేశమై, అమెరికాకు తెలియజేయాల్సిన అంశాలను వారి ద్వారా పంపించనున్నట్లు ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తెలిపారు.

వివరాలు

పాకిస్థాన్ కు వెళ్లే అవకాశం

ఇంతకుముందు వైట్‌హౌస్‌ మాత్రం అమెరికా ప్రతినిధులు నేరుగా చర్చలు జరుపుతారని ప్రకటించగా, తాజాగా టెహ్రాన్‌ దీనిపై స్పష్టతనిచ్చింది. ఈ చర్చల్లో అమెరికా తరఫున అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ పాల్గొననున్నారు. చర్చల్లో పురోగతి కనిపిస్తే, ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ కూడా పాకిస్థాన్‌కు వెళ్లే అవకాశముందని శ్వేతసౌధం పేర్కొంది. ఇదిలా ఉండగా, మలివిడత చర్చలకు ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ దూరంగా ఉండటం గమనార్హం. అంతర్గత విభేదాల కారణంగా ఆయన చర్చల బృందం నుంచి తప్పుకున్నట్లు సమాచారం.

వివరాలు

అమెరికా షరతులకు అంగీకరిస్తేనే ఏదైనా ఒప్పందం

తాజా పరిణామాలపై స్పందించిన ట్రంప్‌, ఈసారి చర్చల్లో అమెరికా డిమాండ్లకు అనుగుణంగా ఇరాన్‌ ప్రతిపాదనలు చేయవచ్చని తెలిపారు. అయితే, అమెరికా షరతులకు అంగీకరిస్తేనే ఏదైనా ఒప్పందం కుదురుతుందని స్పష్టం చేశారు. టెహ్రాన్‌ వద్ద నిల్వలో ఉన్న శుద్ధి చేసిన యురేనియాన్ని వదులుకోవాలని, అలాగే హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను పునరుద్ధరించాలని ఆయన మరోసారి డిమాండ్‌ చేశారు.

Advertisement