Page Loader
Iran: అమెరికాతో ఎలాంటి అణుచర్చలు జరిపే ఉద్దేశం లేదు.. ఇరాన్ 
అమెరికాతో ఎలాంటి అణుచర్చలు జరిపే ఉద్దేశం లేదు.. ఇరాన్

Iran: అమెరికాతో ఎలాంటి అణుచర్చలు జరిపే ఉద్దేశం లేదు.. ఇరాన్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 27, 2025
08:51 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాతో అణు చర్చలు జరిపే ఎలాంటి ఉద్దేశం తమకు లేదని ఇరాన్‌ స్పష్టం చేసింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మాట్లాడుతూ,వచ్చే వారం టెహ్రాన్‌తో అణు చర్చలు జరగనున్నట్టు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్‌ వ్యాఖ్యల్ని ఇరాన్‌ ఖండించింది.ఈ నేపథ్యంలో ఇరాన్‌ విదేశాంగ శాఖ ఉపమంత్రి అబ్బాస్ అరాగ్చీ మాట్లాడుతూ,అమెరికాతో అణుఒప్పందానికి సంబంధించి చర్చలు జరిపే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. ఇటీవల ఇరాన్‌పై జరిగిన దాడులు తీవ్ర నష్టాన్ని కలిగించాయని పేర్కొన్నారు. ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించే దిశగా అధికారులు పరిశీలన చేస్తున్నారని తెలిపారు. ఇక ఈ అంశంపై వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలినా లీవిట్‌ స్పందిస్తూ,ప్రస్తుతానికి అలాంటి చర్చలు ఏవీ జరుగడం లేదని పేర్కొన్నారు.

వివరాలు 

ఇరాన్‌ ఆర్థికంగా కోలుకోవడంలో సహాయం 

అయితే, ఈ ఒప్పంద చర్చలను మళ్లీ ప్రారంభించేందుకు మధ్యవర్తిత్వం చేస్తున్న ఖతార్‌ దేశంతో మాట్లాడుతున్నామన్నారు. ఇక నాటో శిఖరాగ్ర సమావేశం సందర్భంగా హేగ్‌లో జరిగిన కార్యక్రమంలో ట్రంప్‌ మాట్లాడుతూ,వచ్చే వారం టెహ్రాన్‌తో అణు చర్చలు జరుగుతాయని చెప్పారు. అణ్వాయుధాల తయారీ కోరికను ఇరాన్‌ వదులుకునేలా ఒప్పందం చేసుకునే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఇరాన్‌ చమురు ఎగుమతులపై అమెరికా విధించిన ఆంక్షలను సడలించే అవకాశం ఉందని ఆయన సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం ఆ దేశం పునరుద్ధరణకు డబ్బు అవసరమవుతోందని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. అందుకే,ఇరాన్‌ ఆర్థికంగా కోలుకోవడంలో సహాయం చేయడం లక్ష్యంగా కొన్ని ఆంక్షలను సడలించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.