US-Iran War: అమెరికా దాడులకు ఇరాన్ ప్రతీకారం.. క్షిపణులతో ఎదురుదాడి
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు శాంతి ఒప్పందంపై చర్చలు కొనసాగుతుండగానే అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. హర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికా చేపట్టిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. ముఖ్యంగా అమెరికా సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లు సమాచారం. హర్మూజ్ జలసంధి పరిసరాల్లో ఉన్న ఇరాన్ సైనిక కేంద్రాలపై అమెరికా దళాలు దాడులు జరిపిన కొద్దిసేపటికే బందర్ అబ్బాస్ నౌకాశ్రయం వద్ద పలుమార్లు భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఈ ఘటనలను ఇస్లామిక్ విప్లవ రక్షక దళం తీవ్రంగా ఖండించింది.
వివరాలు
గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్‌లను లక్ష్యంగా దాడులు: ఐఆర్‌జీసీ
అమెరికా పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ దురాక్రమణలకు పాల్పడుతోందని ఇరాన్ ఆరోపించింది. ఇలాంటి చర్యలు కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించింది. తాజా దాడులకు ప్రతీకారంగానే గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని ఇస్లామిక్ విప్లవ రక్షక దళం వెల్లడించింది. అయితే ఏ దేశంలోని స్థావరాలపై దాడులు జరిగాయనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇదిలా ఉండగా తమ గగనతలంలోకి క్షిపణులు, మానవరహిత విమానాలు ప్రవేశించాయని కువైట్ రక్షణ దళాలు తెలిపాయి. వాటిని విజయవంతంగా అడ్డుకున్నామని వెల్లడించాయి.