Iran Retaliates: ఇరాన్ ప్రతీకార దాడులు.. అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్‌పై క్షిపణుల వర్షం!
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. అమెరికా సైనిక చర్యలకు ప్రతీకారంగా ఇరాన్ భారీ దాడులకు దిగింది. జోర్డాన్‌లో ఉన్న అమెరికా దళాలకు చెందిన మువాఫక్ సాల్టీ ఎయిర్‌బేస్‌పై క్షిపణి దాడులు జరిపినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించాయి. అయితే ఈ ఘటనపై ఇప్పటి వరకు అమెరికా లేదా జోర్డాన్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇరాన్ వర్గాల సమాచారం ప్రకారం,ఈ ఎయిర్‌బేస్‌లో అమెరికాకు చెందిన ఎఫ్-35 యుద్ధ విమానాలతో పాటు ఇతర సైనిక విమానాలు కూడా ఉన్నాయి. ఇటీవల హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా ఆర్మీకి చెందిన ఏహెచ్-64 అపాచీ హెలికాప్టర్ కూలిన ఘటన తర్వాత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
వివరాలు
కువైట్‌లో అమెరికా బలగాలు ఉన్న ప్రాంతంపై ఇరాన్ డ్రోన్ దాడి
ఆ ఘటనకు ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్‌పై వైమానిక దాడులు చేపట్టగా, వాటికి ఇరాన్ ఎదురుదాడులు ప్రారంభించింది. అమెరికా వైమానిక దళం దాడులకు ప్రతీకారంగా బహ్రెయిన్‌లోని అమెరికా నౌకాదళానికి చెందిన ఫిఫ్త్ ఫ్లీట్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లు ఇరాన్ ప్రకటించింది. అలాగే కువైట్‌లో అమెరికా బలగాలు ఉన్న ప్రాంతంపై డ్రోన్ దాడి చేసినట్లు కూడా వెల్లడించింది. ఈ పరిణామాలు మధ్యప్రాచ్య దేశాల్లో భద్రతా ఆందోళనలను పెంచుతున్నాయి.మరోవైపు,అమెరికా సెంట్రల్ కమాండ్ తమ సైనిక చర్యలపై వివరాలు వెల్లడించింది. ఇరాన్‌కు చెందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్లు,నిఘా రాడార్ కేంద్రాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. బందర్ అబ్బాస్‌తో పాటు ఖాసిమ్ ద్వీప ప్రాంతాల్లో అమెరికా దాడులు జరిగిన విషయాన్ని ఇరాన్ కూడా అంగీకరించింది.
వివరాలు
ఏహెచ్-64 అపాచీ హెలికాప్టర్ ఇరాన్ డ్రోన్ ఢీకొనడం వల్లే కూలిపోయింది
అయితే జరిగిన నష్టం ఎంత అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అమెరికా ఆర్మీకి చెందిన ఏహెచ్-64 అపాచీ హెలికాప్టర్ ఇరాన్ డ్రోన్ ఢీకొనడం వల్లే కూలిపోయిందని ఓ అమెరికా అధికారి వెల్లడించారు. ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా తన సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించారు. అయితే ఆ హెలికాప్టర్‌ను ఉద్దేశపూర్వకంగానే కూల్చివేశారా, లేక ప్రమాదవశాత్తు ఆ ఘటన జరిగిందా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఈ ప్రతీకార దాడులు మధ్యప్రాచ్య ప్రాంతంలో యుద్ధ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చుతున్నాయి. రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలాంటి మలుపు తిరుగుతాయన్న దానిపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.