US-Iran Talks: చర్చలకే ముందే ఇరాన్ సక్సెస్.. నిధుల విడుదలకు అమెరికా గ్రీన్ సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడేలా ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య కీలక శాంతి చర్చలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్షుడు JDవాన్స్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం పాకిస్తాన్ చేరుకుంది. ఇరాన్ తరఫున ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ చర్చలకు నాయకత్వం వహిస్తుండగా, విదేశాంగ మంత్రిఅబ్బాస్ అరాఘ్చి కూడా బృందంలో భాగంగా ఉన్నారు. చర్చలు ప్రారంభమయ్యే ముందు ఇరాన్ కీలక డిమాండ్లతో ముందుకు రావడం గమనార్హం. చర్చలకు హాజరుకావాలంటే రెండు షరతులను అంగీకరించాలని ఇరాన్ స్పష్టం చేసింది. దీంతో ఆ డిమాండ్లకు అమెరికా అంగీకరించినట్లు సమాచారం. అమెరికా ఆంక్షల కారణంగాQatarసహా ఇతర విదేశీ బ్యాంకుల్లో నిలిచిపోయిన ఇరాన్ నిధులను విడుదల చేయడానికి యూఎస్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
వివరాలు
కాల్పుల విరమణ చేయాలి
ఇక మరోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను నిలిపివేయాలని, ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమలు చేయాలని ఇరాన్ పట్టుబట్టింది. రాయిటర్స్ కథనం ప్రకారం ఈ రెండు అంశాలపై కూడా అమెరికా అంగీకరించినట్లు తెలుస్తోంది. నిధుల విడుదలకు ప్రతిగా, హర్ముజ్ జలసంధి గుండా నౌకల సురక్షిత రాకపోకలకు హామీ ఇస్తామని ఇరాన్ వెల్లడించింది. మరోవైపు అమెరికా-ఇరాన్ ప్రతినిధి బృందాలు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌ను కూడా కలవనున్నాయి. ఇప్పటికే ఇరాన్‌కు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధులు ఆయనతో సమావేశమయ్యారు. త్వరలోనే అమెరికా బృందం కూడా పాక్ ప్రధానితో భేటీ కానుంది. ఈ శాంతి చర్చలు మధ్యప్రాచ్య ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక మలుపు తిప్పుతాయా లేదా అన్నది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా మారింది.