50పైగా పాఠాశాలల్లో బాలికలపై విష ప్రయోగం
ఇరాన్‌లో పాఠశాల విద్యార్థినులపై జరుగుతున్న విషప్రయోగాలు దేశంలో కలకలం రేపుతున్నాయి. 50కి పైగా పాఠశాలల విద్యార్థులు విషప్రయోగాల బారిన పడ్డారని అధికారులు ధృవీకరించారు. ఇది గత ఏడాది నవంబర్‌లో ప్రారంభమైందని పేర్కొన్నారు. ఇరాన్‌లోని 30 ప్రావిన్సులు ఉంటే, ఇప్పటి వరకు 21ప్రావిన్సుల్లో విషయ ప్రయోగాలు జరిగినట్లు పేర్కొన్నారు. నవంబర్ నుంచి దాదాపు 700 మంది పాఠశాల బాలికలు విష వాయువు పీల్చుకొని అనారోగ్యానికి గురైనట్లు బిబిసి నివేదిక చెబుతోంది. విష ప్రయోగం ఘనటనలపై విచారణ జరుపుతామని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రకటించారు.
కరడుగట్టిన ఇస్లామిస్ట్ గ్రూపులు పనేనా?
గతేడాది సెప్టెంబర్‌లో 22 ఏళ్ల మహ్సా అమిని పోలీసుల కస్టడీలో మృతి చెందిన తర్వాత.. దేశంలో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి. ఈ క్రమంలో బాలికల పాఠశాలలను మూసివేయడానికి కరడుగట్టిన ఇస్లామిస్ట్ గ్రూపులు రహస్యంగా విష ప్రయోగాలు చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విష వాయువు పీల్చుకున్న వారిలో చాలా మంది తలనొప్పి, మైకము, శ్వాసకోశ సమస్యలు, వికారంతో బాధపడ్డారు. కొందరి కాళ్లకు తాత్కాలిక పక్షవాతం కూడా వచ్చింది. కాళ్లు, పొత్తికడుపులో నొప్పి వంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.