Us-Iran War: ఖేష్మ్ దాడికి ప్రతీకారం.. యూఎస్ స్థావరాలపై ఇరాన్ దాడులు
ఈ వార్తాకథనం ఏంటి
డ్రోన్‌లు, క్షిపణుల మోతతో పశ్చిమాసియా మరోసారి ఉద్రిక్తతలతో మార్మోగింది. ఒకవైపు శాంతి చర్చలు కొనసాగుతుండగానే అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. ఇరుదేశాలు పరస్పరం దాడులకు దిగడంతో ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు జరిపింది. దీనికి కొద్దిసేపటి ముందు ఖేష్మ్ ద్వీపంలోని ఇరాన్ సైనిక కేంద్రాలపై అమెరికా దాడులు నిర్వహించింది. కువైట్‌లోని అల్ సలేం వైమానిక స్థావరం, బహ్రెయిన్‌లోని ఈసా ఎయిర్‌బేస్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులు, డ్రోన్‌లను ప్రయోగించింది. బుధవారం తెల్లవారుజామున కువైట్‌లోని పలు ప్రాంతాల్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
వివరాలు
బహ్రెయిన్‌లో ప్రమాద హెచ్చరిక సైరన్‌లు
వెంటనే వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. ఇరాన్ నుంచి వచ్చిన క్షిపణులు, డ్రోన్‌లను తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయని కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ వెల్లడించింది. మరోవైపు బహ్రెయిన్‌లో కూడా ప్రమాద హెచ్చరిక సైరన్‌లు మోగడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఖేష్మ్ ద్వీపంపై అమెరికా చేసిన దాడులకు ప్రతిస్పందనగానే అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. తమపై జరిగే దురాక్రమణలకు మరింత కఠినమైన, తీవ్ర స్థాయి ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించింది.
వివరాలు
ఐఆర్‌జీసీ ప్రకటనను తోసిపుచ్చిన సెంటకామ్
ఇరాన్ ప్రజల భద్రత, దేశ సార్వభౌమత్వ పరిరక్షణ కోసం అవసరమైతే శత్రువుల స్థావరాలు, ప్రయోజనాలను పూర్తిగా ధ్వంసం చేయడానికీ వెనుకాడబోమని స్పష్టం చేసింది. అలాగే బహ్రెయిన్‌లో ఉన్న అమెరికా నేవీ ఐదో ఫ్లీట్ ప్రధాన కార్యాలయం,ఆ ప్రాంతంలోని మరో అమెరికా వైమానిక స్థావరంపై కూడా క్షిపణులు,డ్రోన్‌లతో విజయవంతంగా దాడులు జరిపినట్లు ఐఆర్‌జీసీ ప్రకటించింది. అయితే ఈ వాదనలను అమెరికా సెంట్రల్ కమాండ్(సెంట్‌కామ్)ఖండించింది. ఐఆర్‌జీసీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించింది.అమెరికా బలగాలపై ఇరాన్ జరిపిన అన్ని దాడులు విఫలమయ్యాయని పేర్కొంది. తమ సైనికస్థావరాలు,బలగాల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకున్నామని,ఎలాంటి ముప్పునైనా సమర్థంగా తిప్పికొట్టేందుకు బలగాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది. ఖేష్మ్ ద్వీపంపై చేపట్టిన చర్యలు పూర్తిగా ఆత్మరక్షణ కోసమేనని సెంట్‌కామ్ స్పష్టం చేసింది.