Iran-US Talks: ఇస్లామాబాద్‌లో అసిమ్ మునీర్‌తో ఇరాన్ బృందం కీలక భేటీ
ఈ వార్తాకథనం ఏంటి
ఇస్లామబాద్‌లో కీలక దౌత్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అసిమ్ మునీర్‌తో అబ్బాస్ అరాఘ్చి నేతృత్వంలోని ఇరాన్ బృందం భేటీ అయింది. ఈ సమావేశంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఇరాన్ ప్రతిపాదనలపై చర్చించినట్లు సమాచారం. అమెరికాతో నేరుగా చర్చలు జరపబోమని ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో, తమ ప్రతిపాదనలను పాకిస్థాన్ ద్వారా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అమెరికా బృందం శనివారం సాయంత్రానికి ఇస్లామాబాద్ చేరుకోనుంది. ఈ దఫా చర్చలకు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరుకాకపోగా, అమెరికా తరఫున మధ్యప్రాచ్య ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, అలాగే జారెడ్ కుష్నర్ పాల్గొననున్నట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ వెల్లడించారు.
వివరాలు
తొలి దశలో 21 గంటల పాటు చర్చలు
చర్చల కోసం ఇరాన్ నుంచే సంప్రదింపులు జరిగాయని, ముఖాముఖి సమావేశానికి వారు ఆసక్తి చూపినట్లు తెలిపారు. ఈ చర్చల వివరాలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌కు తెలియజేస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఇస్లామాబాద్ వేదికగా సుమారు 21 గంటల పాటు తొలి దశ చర్చలు జరిగాయి. అయితే అవి ఫలించలేదు. రెండో దఫా చర్చలు గత బుధవారం జరగాల్సి ఉన్నప్పటికీ చివరి నిమిషంలో వాయిదా పడ్డాయి.
వివరాలు
అంతర్జాతీయ ఉత్కంఠ
అనూహ్యంగా ఇప్పుడు శనివారం మరోసారి చర్చలకు శ్రీకారం చుట్టడంతో అంతర్జాతీయంగా ఉత్కంఠ నెలకొంది. ఈసారైనా చర్చలు ఫలిస్తాయా లేదా అన్నదానిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇక ఈ చర్చల నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరాన్ని భద్రతా దళాలు పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నాయి. నగరంలోకి అనుమతి లేకుండా ఎవరూ ప్రవేశించకుండా కఠిన చర్యలు తీసుకున్నారు.