Oil prices : మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. చమురు ధరలు 200 డాలర్లకు చేరే ప్రమాదం!
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చుతున్న వేళ ఇరాన్‌కు చెందిన అత్యున్నత సైనిక విభాగం 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్' సంచలన ప్రకటనతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రపంచ ఇంధన రవాణాలో కీలక పాత్ర పోషించే 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' (Strait of Hormuz)ను పూర్తిగా మూసివేస్తున్నట్లు వెల్లడిస్తూ, ఆ మార్గం గుండా ప్రయాణించే ఏ నౌకనైనా దహనం చేస్తామని కఠిన హెచ్చరిక జారీ చేసింది. శనివారం నుంచి ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అల్ ఖమేనీతో పాటు పలువురు కీలక అధికారులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, ప్రతీకార చర్యగా ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
వివరాలు
"నౌకలను తగులబెడతాం" - ఐఆర్‌జీసీ హెచ్చరిక..
ఐఆర్‌జీసీ కమాండర్-ఇన్-చీఫ్ సీనియర్ సలహాదారు ఇబ్రహీం జబారి,ఇరాన్ ప్రభుత్వ మీడియా ద్వారా ఘాటైన సందేశాన్ని పంపించారు. "హార్ముజ్ జలసంధిని మూసివేశాం.ఎవరైనా దాటేందుకు ప్రయత్నిస్తే రివల్యూషనరీ గార్డ్,నౌకాదళ సిబ్బంది ఆ నౌకలను తగులబెడతారు" అని స్పష్టం చేశారు. ఇరాన్-ఒమన్ దేశాల మధ్య ఉన్న ఈ హార్ముజ్ జలసంధి గుండా ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం రవాణా జరుగుతుంది. ఇది మూసివేతకు గురవుతుందనే సంకేతం వచ్చినా ప్రపంచ కమోడిటీ మార్కెట్లు,అంతర్జాతీయ దౌత్య వర్గాలు కుదేలవుతాయి. ఆసియా,యూరప్ ఆర్థిక వ్యవస్థలకు ఈ మార్గం అత్యంత ప్రాధాన్యం కలిగి ఉంది. ఇది పూర్తిగా నిలిచిపోతే ద్రవ్యోల్బణ ఒత్తిడి గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.అంతేకాక ప్రధాన దేశాల ద్రవ్య విధానాలు కూడా సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది.
వివరాలు
ఒక్క చుక్క చమురు బయటకు వెళ్లనివ్వం: జబారి
జబారి మరో హెచ్చరిక చేస్తూ, "చమురు పైప్‌లైన్లను కూడా లక్ష్యంగా చేసుకుంటాం. ఈ ప్రాంతం నుంచి ఒక్క చుక్క చమురు బయటకు వెళ్లనివ్వం. రాబోయే రోజుల్లో బ్యారెల్ చమురు ధర 200 డాలర్లను తాకుతుంది" అని ఐఆర్‌జీసీ టెలిగ్రామ్ ఛానెల్‌లో పేర్కొన్నారు. అమెరికాపై విమర్శలు గుప్పిస్తూ, "వేల కోట్ల డాలర్ల అప్పుల్లో ఉన్న అమెరికా ఈ ప్రాంత చమురుపై ఆధారపడుతోంది. అయితే వారికి ఒక్క చుక్క చమురు కూడా అందదనే విషయాన్ని గ్రహించాలి" అని వ్యాఖ్యానించారు.
వివరాలు
కుదేలవుతున్న ఇంధన మార్కెట్లు.. పెరిగిన గ్యాస్ ధరలు
ఇరాన్ హెచ్చరికలతో ఇంధన మార్కెట్లు వెంటనే ప్రభావితమయ్యాయి. తమ సౌకర్యాలపై జరిగిన దాడుల కారణంగా 'ఖతార్ ఎనర్జీ' లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ) ఉత్పత్తిని నిలిపివేయడంతో యూరప్‌లో గ్యాస్ ధరలు సుమారు 50 శాతం,ఆసియాలో దాదాపు 40 శాతం పెరిగాయి. ఇక అంతకుముందు రోజున,రోజుకు అర మిలియన్ బ్యారెళ్లకు పైగా ముడి చమురును శుద్ధి చేసే సామర్థ్యం గల సౌదీ అరేబియాలోని 'రాస్ తనూరా' ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ దాడులు జరిగినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది. అయితే ఈ దాడులను గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకున్నట్లు తెలిపింది. ట్యాంకర్ల రాకపోకలకు ఆటంకాలు,రిఫైనరీలపై దాడుల భయం,పైప్‌లైన్లకు ముప్పు.. ఈ పరిణామాలన్నీ కలిపి ప్రపంచ సరఫరా వ్యవస్థపై ఆందోళనలు పెంచుతున్నాయి.
వివరాలు
రంగంలోకి అమెరికా
ఒకవేళ హార్ముజ్ జలసంధి దీర్ఘకాలం మూసివేస్తే చమురు ధరలు ఆధునిక మార్కెట్ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా బ్యారెల్‌కు 200 డాలర్ల స్థాయిని చేరవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ధరల పెరుగుదల ప్రభావాన్ని నియంత్రించేందుకు అమెరికా చర్యలకు సిద్ధమైంది. మార్కెట్‌లో వచ్చే ఒడిదుడుకులను ముందుగానే అంచనా వేసినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. పరిస్థితి ప్రభావాన్ని తగ్గించేందుకు తక్షణ చర్యలు చేపడతామని వెల్లడించారు.